ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు ఏదంటే.. అది భవిష్యత్తులో రాబోయే 'కరోనా వైరస్ టీకా'నే. జన జీవనం కుదేలైపోయేట్లు చేసిన ఈ వైరస్‌ను కట్టడి చేయడం ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీకా తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 150కు పైగా టీకాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీ అగ్రరాజ్యాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితంగా కుట్రలు.. వెన్నుపోటులకు తెరలేచింది. హ్యాకింగ్‌లు, శాస్త్రవేత్తల హత్యలు, ఉద్దేశపూర్వకంగా సమాచారం గోప్యంగా ఉంచడం వంటివి జరుగుతున్నాయి.
సంచలనం సృష్టించిన రష్యా ప్రకటన
కరోనా వైరస్‌ను అడ్డుకొనే టీకాను తయారు చేశామని గత వారం రష్యాకు చెందిన సెచినోవ్ విశ్వవిద్యాలయంలోని గమలియ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. తొలిదశ ప్రయోగాలు 45 మందిపై చేసినట్లు పేర్కొంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నోరు మెదపలేదు. అయితే టీకా తక్కువ మందిపై ప్రయోగించడం.. విడుదలకు సిద్ధమవుతోందని వేగంగా ప్రకటించడం వంటివి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి టీకా తయారీకి 15ఏళ్లు అయినా పడుతుంది. వీటిల్లో వివిధ దశలను దాటాల్సి ఉంటుంది. కనీసం 12 నుంచి 18 నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రకటనపై సందేహాలు వచ్చాయి.
అదే సమయంలో బ్రిటన్ సెక్యూరిటీ మినిస్టర్ జేమ్స్ బ్రోకెన్‌షైర్ సంచలన ప్రకటన చేశారు. టీకా పరిశోధనలు చేస్తున్న సంస్థలపై రష్యా ప్రభుత్వ సహకారంతో 'కోజీ బేర్' (ఏపీటీ 29) అనే గ్రూప్ హ్యాకింగ్‌కు పాల్పడుతోందనడాన్ని 95 శాతం కచ్చితత్వంతో చెప్పగలనని.. ఈ గ్రూప్ క్రెమ్లిన్ వేగుల బృందంలో కీలకమైన విభాగమని పేర్కొన్నారు. ఎంత డేటాను రష్యా చోరీ చేసిందనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. రష్యా గతంలో కూడా బ్రిటన్‌లో గూఢచర్యం చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంది. దీనికి అమెరికా, కెనడాలు మద్దతు తెలిపాయి. మరోపక్క యూకే ఆరోపణలను రష్యా తిరస్కరించింది. పొంతన లేని ఆరోపణలని కొట్టిపారేసింది.