తెలంగాణ

telangana

ETV Bharat / international

రెచ్చిపోయిన రష్యా.. జనావాసాలపై దాడులు.. 352 మంది మృతి

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆ దేశంలోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులు చేసింది. ఈ దాడుల్లో కొందరు పౌరులు చనిపోయారు. ఖార్కివ్‌పై గుండ్ల వర్షాన్ని యుద్ధనేరంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఒకిట్రికా న‌గ‌రంలోని సైనికస్థావ‌రంపై రష్యా చేసిన దాడిలో 70మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు. మరోవైపు, 5 వేల మంది రష్యా సైనికులు చనిపోవడమో, పట్టుబడటమో జరిగిందని నిఘా వర్గాలు తెలిపాయి.

RUSSIA WAR UPDATES
RUSSIA WAR UPDATES

By

Published : Mar 1, 2022, 9:41 PM IST

Updated : Mar 1, 2022, 10:38 PM IST

Russia Ukraine war: ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో మాస్కో దాడులను ఉద్ధృతం చేసింది. ఆరో రోజు ఉక్రెయిన్‌ రెండో పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ సేనలు విరుచుకుపడ్డాయి. సోవియట్ కాలంనాటి పరిపాలనా భవనంతోపాటు అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు, క్షిపణులతో దాడి చేశాయి. జనావాసాలపై కూడా రష్యా బాంబులు దాడులు చేస్తున్నట్లు ఆరోపించిన ఉక్రెయిన్‌ ప్రభుత్వం అందుకు సాక్ష్యంగా పలు వీడియోలు విడుదల చేసింది.

ధ్వంసమైన ఖార్కివ్​లోని ఓ ప్రభుత్వ భవనం

Russia Ukraine latest news

ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులను రష్యా సైన్యం లక్ష్యం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తుండగా వాటిని రష్యా ఖండించింది. జనావాసాలు తమ లక్ష్యం కాదని రష్యా స్పష్టం చేసింది. ఖార్కివ్‌లో కనీసం 11మంది పౌరులు మరణించారని, చాలామంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ తెలిపింది. రాజధాని కీవ్‌ను కాపాడుకోవటమే తమ తొలి ప్రాధాన్యమని ఉక్రెయిన్ నేతలు పేర్కొన్నారు. రష్యా సైనిక చర్య ద్వారా ఐరోపాలో శాంతికి విఘాతం కలిగిందన్న నాటోచీఫ్‌ తమ భూభాగాన్ని నాటోకూటమి కాపాడుకుంటుందన్నారు.

ధ్వంసమైన ఇంటిని ఫొటో తీస్తున్న మహిళ

ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతమైన ఒకిట్రికా న‌గ‌రంలోని సైనిక స్థావ‌రంపై ర‌ష్యా దాడి చేయగా.. 70మంది సైనికులు మృతి చెందారు. రాజధాని కీవ్‌లో పట్టు కోసం రష్యా తన ప్రయత్నాలను ఉద్ధృతం చేసింది. పుతిన్‌ ప్రభుత్వం సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగులను పెద్దఎత్తున కీవ్‌ వైపు తరలిస్తోంది. ఉక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరం మారియుపోల్‌సహా ఇతర పట్టణాలు, నగరాల్లోనూ ఇరు సైన్యాల మధ్య భీకరపోరాటం జరుగుతోంది. బెర్డియాన్స్‌క్‌లో వేలాది మంది ప్రజలు రష్యా యుద్ధ ట్యాంకులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. తమ గగనతలం రష్యా నియంత్రణలో ఉందన్న వార్తలను ఉక్రెయిన్‌ ఖండించింది.

డొనెట్​స్క్ నుంచి బయటకు వెళ్తున్న వాహనాలు
వాహనాల వరుస

5 వేల మంది మృతి!

యుద్ధంలో ఇప్పటివరకు 5 వేల మంది రష్యా సైనికులను పట్టుబడటమో, చనిపోవడమో జరిగిందని ఓ సీనియర్ నిఘా అధికారి వెల్లడించారు. భారీ సంఖ్యలో రష్యా విమానాలు, ట్యాంకులు, వివిధ నిఘా సంస్థలు అందించిన సమాచారం మేరకు ఈ విషయాలను వెల్లడించారు. గడిచిన 48 గంటల వ్యవధిలో రష్యా తన పోరాటాన్ని ఉద్ధృతం చేసిందని, ఖార్కివ్, కీవ్ నగరాల్లో భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడుతోందని చెప్పారు. డాన్​బాస్ ప్రాంతంలోనూ రష్యా సేనలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రష్యా అండ ఉన్న వేర్పాటువాదులతో గడిచిన ఎనిమిదేళ్లుగా పోరాడుతున్న ఉక్రెయిన్.. మెరుగ్గా ప్రతిఘటిస్తోందని వివరించారు.

కీవ్​లో షెల్లింగుల ధాటికి ధ్వంసమైన వాహనంలో నుంచి బయటకు వస్తున్న వ్యక్తి..

10 లక్షల మంది నిరాశ్రయులు

ఉక్రెయిన్‌లో కొన్నినగరాల్లో పలు భవనాలపై ఎర్రరంగుతో వేసిన ఇంటూ, బాణం గుర్తులు కనిపించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. రష్యన్ సేనలు దాడి చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజలు తాము నివసించే భవనాల పైకప్పులపై ఏమైనా అనుమానాస్పద గుర్తులు ఉంటే వాటిని తక్షణం కవర్‌ చేయాలని సూచించింది. పౌరుల మృతికి కారణమైన ఖార్కివ్‌పై దాడులను యుద్ధ నేరంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా ఇప్పటివరకు 56రాకెట్లు, 113క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగా, 14మంది చిన్నారులుసహా 352మంది పౌరులు మృతిచెందిన‌ట్లు ఉక్రెయిన్ ప్రక‌టించింది. రష్యాదాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 10లక్షల మంది నిరాశ్రయులుకాగా.. 6.60లక్షల మందికిపైగా ఐరోపాలోని పలు దేశాలకు తరలివెళ్లినట్లు ఐరాస శరణార్థి సంస్థ ప్రకటించింది.

దాడుల్లో ధ్వంసమైన కారు

మరోవైపు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై సైనికదాడి ముగించాలని మరోసారి సూచించినట్లు ఫ్రాన్స్‌ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు ఇతర దేశాల నుంచి మద్దతు పెరుగుతుండగా క్షిపణులను పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.

సరిహద్దు దాటి వచ్చి.. ఆరిపోయిన చలిమంట ముందు కూర్చున్న ఉక్రెయిన్ పౌరుడు.

ఇదీ చదవండి:ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా ఔట్?

Last Updated : Mar 1, 2022, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details