తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రెసిడెంట్​ పుతిన్‌ 'అణ్వస్త్రం' ప్రయోగిస్తారా?.. ఒకవేళ చేస్తే!

Nuclear dangers ఉక్రెయిన్​పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదివారం.. రష్యా అణ్వస్త్ర దళాలకు పుతిన్ ఆదేశాలతో ఈ అనుమానం కలుగుతోంది. రష్యాను నాశనం చేయాలనుకునేవారిపై దీటుగా స్పందించే హక్కు తమకుందని నాలుగేళ్ల కిందటే పుతిన్ ప్రపంచాన్ని హెచ్చరించారు. ప్రస్తుత తరుణంలో అవకాశం లేదని.. కానీ కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

nuclear bomb
న్యూక్లియర్ బాంబు

By

Published : Mar 1, 2022, 9:06 AM IST

nuclear dangers ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తారా? తన అణ్వస్త్ర దళాలకు ఆదివారం ఆయన ఇచ్చిన అప్రమత్తత ఆదేశాలతో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని ఉత్తుత్తి బెదిరింపుగా కొందరు పరిగణిస్తున్నారు. అణు దాడి అవకాశాలు తక్కువేనని, అయితే ఆయన ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు ‘బాంబు’ ప్రయోగాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పలువురు రక్షణ నిపుణులు చెబుతున్నారు. ''రష్యాను నాశనం చేయాలనుకునే వారిపై దీటుగా స్పందించే హక్కు మాకు ఉంటుంది. అది మానవాళికి, ప్రపంచానికి పెను వినాశనకారి కావొచ్చు’’ అని నాలుగేళ్ల కిందట పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాలను బయటపెడుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో జోక్యం చేసుకుంటే కనీవినీ ఎరుగని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫిబ్రవరి 24న ఆయన నర్మగర్భంగా అణ్వస్త్ర దాడి హెచ్చరిక చేయడాన్నీ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. యుద్ధ తీరుతెన్నులు తాను ఊహించిన రీతిలో లేకపోవడం వల్ల అణ్వస్త్ర బూచిని ఆయన తెరపైకి తెచ్చారని విమర్శలు వస్తున్నాయి. అణ్వస్త్రాలు ఆత్మరక్షణ సాధనాలని, వాటి వల్ల యుద్ధభయం తొలగిపోతుందని పలువురు నేతలు సూత్రీకరించేవారు. వాటివల్ల అంతర్జాతీయంగా సుస్థిర పరిస్థితులు నెలకొంటాయన్న భావనను వారు వ్యక్తంచేసేవారు. ఇవి 'అలంకారప్రాయ ఆయుధాలు' కావని స్పష్టమవుతోంది. దేశాలు తమ అణ్వాయుధాగారాలను ఆధునికీకరించడం, విస్తరించడం వంటివి చేస్తున్న నేపథ్యంలో వాటిని ‘వినియోగ యోగ్య సాధనాలు’గానే రాజకీయ, సైనిక నాయకులు భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఏయే సందర్భాల్లో వినియోగించొచ్చు?

ప్రత్యర్థులపై పైచేయి సాధించాలన్న వ్యూహంలో భాగంగా..

ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో శత్రువు వెనకడుగు వేసేలా చేయడానికి..

యుద్ధంలో చిట్టచివరి ప్రయత్నంగా..

తమ దేశంపైకి దూసుకొస్తున్న క్షిపణిలో అణుబాంబు ఉందని పొరబడినప్పుడు..

అణ్వస్త్రాల నియంత్రణకు ఉద్దేశించిన ‘కమాండ్‌, కంట్రోల్‌’ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడూ పొరపాటున పరమాణు బాంబు ప్రయోగం జరగొచ్చు.

ప్రస్తుత యుద్ధంలోనూ ముప్పు

ఉక్రెయిన్‌ వద్ద అణ్వస్త్రాలు లేనంతమాత్రాన ప్రస్తుత యుద్ధంలో పరమాణు బాంబు ముప్పు లేనట్లుగా భావించకూడదు. ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాగారాన్ని రష్యా కలిగి ఉంది. యుద్ధరంగంలో సైనిక యూనిట్లపై ప్రయోగించే చిన్నపాటి ‘టాక్టికల్‌ అణ్వస్త్రాలు’ కూడా పుతిన్‌ సేన వద్ద భారీగానే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ మిత్రపక్షం అమెరికా వద్ద కూడా పెద్ద సంఖ్యలో అధునాతన పరమాణు బాంబులు ఉన్నాయి. నాటో కూటమి మిత్ర దేశాలు ఫ్రాన్స్‌, బ్రిటన్‌కూ అణు సామర్థ్యం ఉంది. బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, టర్కీ దేశాల్లో అమెరికా అణ్వస్త్రాలు ఉన్నాయి.

ఉక్రెయిన్‌ యుద్ధంలోకి నేరుగా దిగడానికి నాటో కూటమి సిద్ధపడటంలేదు. అయినా అమెరికా, నాటోలతో రష్యాకు పెరుగుతున్న విభేదాలు అణు యుద్ధానికి దారితీయవచ్చు. ఆకస్మికంగా జరిగే కొన్ని పరిణామాలతో యాదృచ్ఛికంగా ఇది చోటుచేసుకోవచ్చు. పుతిన్‌ తన అణ్వస్త్ర బలగాలను అప్రమత్తతలో ఉంచిన తరుణంలో దీన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడేం చేయాలి?

అణ్వస్త్ర అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత యుద్ధాన్ని తక్షణం ఆపాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది ఉక్రెయిన్‌ ప్రజలకు, ఐరోపాకు మాత్రమే కాక మానవాళి, భూమి మీదున్న సమస్త జీవరాశి శ్రేయస్సు దృష్ట్యా అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. వారు చేస్తున్న సూచనలివీ..

అంతర్జాతీయంగా రాజకీయ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి భద్రత, అంతర్జాతీయ చట్టాలకు బాసటగా నిలవాలి. లక్ష్యాలకు అనుగుణంగా ఐరాస పనిచేసేలా చూడాలి.

అణుయుద్ధ ముప్పు మధ్య జీవనం తమకు ఆమోదయోగ్యం కాదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్పష్టంచేయాలి. వీటితో సుస్థిర పరిస్థితులు ఉంటాయన్నది అపోహేనన్నది గుర్తించాలి. ముఖ్యంగా బాధ్యత లేని ప్రభుత్వాధినేతల చేతిలో అవి ఉండటం ప్రమాదకరమని గమనించాలి. ఆ బాంబుల నిర్మూలనకు డిమాండ్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

అణ్వాయుధాల స్థానంలో.. అంతర్జాతీయ చట్టాలను సమర్థంగా పరిరక్షించే ఐరాస వ్యవస్థకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ ప్రయోగిస్తే ఎక్కడ..?

ఒకవేళ అణ్వస్త్ర ప్రయోగానికి పుతిన్‌ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని ఎక్కడ వేస్తారన్న దానిపై ప్రస్తుతం రక్షణ వ్యూహకర్తల్లో జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. జనావాసాలపై ఆయన ఈ ప్రయోగం చేయకపోవచ్చని, తొలుత హెచ్చరికగా డెన్మార్క్‌, బ్రిటన్‌ మధ్య ఉన్న ఉత్తర సముద్రంపైన బాంబును వేయవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈయూలో చేరేందుకు జెలెన్‌స్కీ సంతకం.. మరో విడత చర్చలు అక్కడే..!

ABOUT THE AUTHOR

...view details