RUSSIA UKRAINE WAR UPDATES: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. పలు నగరాలపై షెల్లింగులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. క్షిపణి దాడులను గుర్తించే వ్యవస్థలు.. ప్రజలను హెచ్చరిస్తూ పెద్దగా సైరన్లు చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని సవెరోడొనెస్ట్క్పై రష్యా సైన్యం చేసిన దాడిలో 10 మంది పౌరులు మరణించారు.
RUSSIA UKRAINE HUMANITARIAN CORRIDOR:
మరోవైపు, పౌరుల సురక్షిత తరలింపు కోసం మానవతా కారిడార్ ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించుకున్నాయి. 12 గంటల పాటు తరలింపు ప్రక్రియ కొనసాగనుందని అధికారులు చెప్పారు. సుమీ నగరంలోని పౌరులను మానవతా కారిడార్ మీదుగా తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మంగళవారం 5 వేల మంది విదేశీయులు సుమీని వీడారు.
RUSSIA UKRAINE PEACE TALKS:
కాగా, ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చల్లో కాస్త పురోగతి లభించిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది.
రష్యా అధీనంలోకి చెర్నోబిల్..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్న క్రమంలో చెర్నోబిల్‌లోని అణు విద్యుత్ కేంద్రం పర్యవేక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం(ఐఏఈఏ). చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ నుంచి డేటా ట్రాన్సిమిషన్ ఆగిపోయినట్లు తెలిపింది. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణ సంస్థ ఐఏఈఏకు ఇకపై ప్లాంట్ నుంచి సమాచారం అందదని పేర్కొంది.
అయితే, చెర్నోబిల్, జపోరియా అణువిద్యుత్ కేంద్రాలపై తాము పూర్తి నియంత్రణ సాధించినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. అణువిద్యుత్ కేంద్రాలను అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్ ఎలాంటి కవ్వింపులకు పాల్పడకుండా చేసేందుకే ఇలా చేసినట్లు చెప్పారు.
అణు రేడియేషన్ భయాలు?
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధికారులు ఆందోళనకర వార్త చెప్పారు. న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని తెలిపారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్‌కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్‌లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లు.. ప్లాంట్‌కు కావాల్సిన విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఈ జనరేటర్లకు 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉంది. విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్‌ను చల్లార్చే వ్యవస్థలపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుంది. రేడియేషన్‌ను నియంత్రించడం కష్టమవుతుంది.