తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి - updates on ukraine and russia war

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. బాంబులతో దాడులు చేస్తోంది. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన లక్షిత దాడుల్లో 10 మంది పౌరులు మరణించారు. రెండు ఆయిల్ డిపోలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

RUSSIA UKRAINE WAR
RUSSIA UKRAINE WAR

By

Published : Mar 8, 2022, 3:27 PM IST

Updated : Mar 8, 2022, 4:52 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. పలు నగరాల్లోని విదేశీయులను తరలించేందుకు మానవతాసాయం కోసం రష్యా కాల్పులవిరమణ ప్రకటించినప్పటికీ... బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. జైటోమిర్ నగరాల్లోని ఆయిల్ డిపోలపై రష్యా వైమానిక దళాలు దాడులు చేశాయి. దీంతో రెండు డిపోల నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

Sumy bombing Russia

సుమీ నగరంలో రష్యా వాయు సేనలు చేసిన లక్షిత దాడుల్లో 10 మంది పౌరులు మరణించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని సుమీ ప్రాంతీయ పరిపాలనాధికారి దిమిత్రీ జివిట్స్కీ వెల్లడించారు. నివాస ప్రాంతాలపైనా దాడులు చేస్తోందని ఫేస్​బుక్​లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

విధ్వంసం..

కాగా, పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. 5 నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. సుమీ నగరం నుంచి వ్యక్తిగత వాహనాల్లో స్థానికులను తరలిస్తు‌న్నట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని ఇరీనా వెరెస్‌చుక్ వెల్లడించారు. ఇర్ఫిన్ నగరంలో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులను తీసుకుని స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

20 లక్షల మంది శరణార్థులు

ఉక్రెయిన్​పై రష్యా చేసిన దాడితో ప్రపంచంలో మరో మానవతా సంక్షోభం తలెత్తింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఉక్రెయిన్​ను వీడిన శరణార్థుల సంఖ్య మంగళవారం నాటికి 20 లక్షలు దాటిందని లెక్కగట్టింది.

మరోవైపు, మానవతా కారిడార్​ను అట్టుకుంటోందని ఐక్యరాజ్య సమితిలో రష్యా, ఉక్రెయిన్​ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా దాడుల వల్ల భారత్, చైనా, టర్కీ, పాకిస్థాన్​కు చెందిన 2 వేల మంది విద్యార్థుల తరలింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉక్రెయిన్ ప్రతినిధి పేర్కొన్నారు. భారతీయులతో పాటు ఉక్రెయిన్​లో చిక్కుకున్న అమాయక పౌరుల తరలింపునకు అవాంతరాలు లేకుండా చూడాలని ఉక్రెయిన్, రష్యాలను భారత్ కోరింది.

ఆగని ఆంక్షలు

sanctions on Russia: మరోవైపు.. రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు యుద్ధవిమానాలను అందించాలని నిర్ణయించుకుంటే పోలాండ్‌కు మద్దతు ఇస్తామని బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలెస్ వెల్లడించారు. ఇలా చేస్తే పోలాండ్‌కు ప్రత్యక్షంగా హాని కలగవచ్చని పేర్కొన్నారు. పోలాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని వాలెస్ తెలిపారు.

ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా... రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ.. చమురు దిగుమతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇక, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీ ఖరారైంది. ఈనెల 10న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధమైనట్లు ఉక్రెయిన్ మంత్రి దమిత్రో కులేబా ధ్రువీకరించారు.

కీవ్ సమీపంలో లక్షన్నర సైన్యం!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా పుతిన్‌ సేనలు కదులుతున్న వేళ అమెరికా నిఘా విభాగం కీలక విషయాలు వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు ముందు ఆ దేశ సరిహద్దులో లక్షా 50వేల బలగాలను రష్యా మోహరించింది. ప్రస్తుతం ఆ లక్షా 50 వేలమందికి పైగా మాస్కో సేనలు పూర్తిగా ఉక్రెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య పోరు మరింత భీకరంగా మారే ప్రమాదం ఉందని అమెరికా అంచనా వేసింది. పుతిన్‌ సేనలు కీవ్‌కు ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నాయని తెలిపింది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌ స్థావరాలపై దాదాపు 625కుపైగా క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. ఇప్పటికీ క్షిపణి దాడులను కొనసాగిస్తూనే ఉందని పేర్కొంది. ఉక్రెయిన్ సేనలు సైతం పుతిన్‌ బలగాలను దీటుగా ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. ఈ యుద్ధం మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే రష్యా భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని అమెరికా మరోసారి హెచ్చరించింది.

నాటో దేశాలకు మరిన్ని బలగాలు..

మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నాటో దేశాలకు మరో 500మంది బలగాలను తరలిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని నాటో సభ్య దేశాలపై యుద్ధ ప్రభావం పడితే తక్షణమే చర్యలు తీసుకునేలా బలగాలను పంపినట్లు పేర్కొంది. ఈ బలగాలతో కలిపి... ఇప్పటివరకు నాటో సభ్యదేశాల్లో లక్షకు పైగా అమెరికా సేనలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం గ్రీస్‌కు సమీపంలో ఈ 500 మంది సైనికులను పంపుతున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.

మేజర్ జనరల్ మృతి

ఉక్రెయిన్‌ బలగాల దాడిలో రష్యన్ మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ మృతి చెందినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఖార్కివ్ సమీపంలో జరిగిన దాడిలో విటాలి చనిపోయినట్లు పేర్కొంది. మేజర్ జనరల్ మృతిపై పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇదీ చదవండి:నీరే అగ్గి రాజేసింది.. ఉక్రెయిన్‌తో రష్యా వివాదానికి కారణం ఇదేనా!

Last Updated : Mar 8, 2022, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details