తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధభూమిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. సైనికుల్లో స్ఫూర్తి నింపుతూ.. - రష్యా ఉక్రెయిన్ తాజా వార్తలు

Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ నేతృత్వంలో దేశం ఇప్పుడు భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. జెలెన్‌స్కీని పదవి నుంచి తప్పించడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టంచేశారు. అయినా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వెరవడంలేదు. తన సైన్యం ఆయుధాలను వీడబోదని తేల్చి చెబుతున్నారు. కీవ్‌లో వేల మంది వాలంటీర్లను ఆయుధాలతో సిద్ధం చేశారు.

Russia Ukraine War
యుద్ధభూమిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు

By

Published : Feb 27, 2022, 7:56 AM IST

Russia Ukraine War: వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ..! హాస్యనటుడిగా ఒకప్పుడు ఉక్రెయిన్‌లో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఆయన ఇప్పుడు 'సీరియస్‌ పాత్ర'లోకి మారిపోయారు. దేశాధ్యక్ష హోదాలో తన సైనికులు, పౌరుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంచుకొస్తున్న రష్యన్‌ సేనలను ఎదుర్కొనేలా సమాయత్తం చేస్తున్నారు. తనకు పరిచయంలేని ఈ కొత్త 'పాత్ర'ను అద్భుతంగా పోషించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఐదేళ్లుగా డాన్‌బాస్‌ ప్రాంతంలో వేర్పాటువాదులతో జరుగుతున్న పోరుతో విసుగెత్తిన ఉక్రెయిన్‌లో శాంతి పవనాలు వీచేలా చూస్తానన్న హామీతో జెలెన్‌స్కీ.. 2019లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. శాంతి సంగతి అటుంచితే.. ఆయన నేతృత్వంలో దేశం ఇప్పుడు భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఆయనది ఫాసిస్టు ప్రభుత్వమని, డాన్‌బాస్‌ ప్రాంతంలో ప్రజలను ఊచకోత కోశారని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపిస్తున్నారు. ఇవి అర్థరహిత విమర్శలని పశ్చిమ దేశాలు కొట్టిపడేస్తున్నాయి. రాజధాని కీవ్‌ను రష్యా సేన ముట్టడిస్తోంది.

జెలెన్‌స్కీని పదవి నుంచి తప్పించడమే తమ లక్ష్యమని పుతిన్‌ స్పష్టంచేశారు. అయినా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వెరవడంలేదు. తన సైన్యం ఆయుధాలను వీడబోదని తేల్చి చెబుతున్నారు. కీవ్‌లో వేల మంది వాలంటీర్లను ఆయుధాలతో సిద్ధం చేశారు.

'పాండోరా'తో మసక..

30 ఏళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందిస్తానని ఎన్నికల వేళ జెలెన్‌స్కీ భరోసా ఇచ్చారు. వీటిని ఉక్రెయిన్‌వాసులు విశ్వసించారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎన్నికల్లో 73 శాతం ఓట్లను ఆయన సాధించారు. అయితే గత ఏడాది విడుదలైన టపాండోరా పేపర్స్‌' ఆయన 'అవినీతి వ్యతిరేక' ముద్రను మసకబార్చాయి. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులు, సైప్రస్‌ వంటి చోట్ల ఆయనకు డొల్ల కంపెనీలు ఉన్నాయని ఆ పత్రాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన ప్రజాదరణ అట్టడుగు స్థాయికి పడిపోయింది.

ఇప్పుడు యుద్ధసమయంలో ఆయన చూపుతున్న నాయకత్వ పటిమ, ప్రసంగాలు 'కొత్త జెలెన్‌స్కీ'ను ఆవిష్కరించాయి. యుద్ధం అనివార్యమని గుర్తించినప్పటి నుంచి ఆయన తీరు మారిపోయింది. ఈ నెల 19న మ్యూనిక్‌ భద్రతా సదస్సులో ఆయన పశ్చిమ దేశాలకు కతృజ్ఞతలు చెబుతూ చేసిన వ్యాఖ్యలు ఉక్రెయిన్‌వాసుల మనసును చూరగొంది. తమకు సాయం, తోడ్పాటు అందించినందుకు పశ్చిమ దేశాలకు కృతజ్ఞతలు చెబుతూనే ఆయన సునిశితంగా విమర్శలూ చేశారు. ఆ దేశాల భద్రత, విలువల కోసమూ తాము పోరాడుతుని, అయినా తమ రక్షణకు వారు ఏమీ చేయలేదన్నారు.

  • పెరిగిన గడ్డంతో, ఖాకీ దుస్తులతో జెలెన్‌స్కీ శుక్రవారం తన దేశ ప్రజలకు ఒక వీడియో సందేశమిచ్చారు. తనను చంపేయడానికి నియమితులైన విద్రోహులు ముంచుకొస్తున్నారని చెప్పారు. "నన్ను నెంబర్‌ వన్‌ లక్ష్యంగా ఎంచుకున్నారు. ఉక్రెయిన్‌ను రాజకీయంగా నాశనం చేయాలనుకుంటున్నారు. అయినా నేను రాజధానిలోనే ఉంటా. మా దేశాన్ని రక్షించుకోవడానికి వెరవబోం" అని స్పష్టంచేశారు.
  • అంతకుముందు రోజు జెలెన్‌స్కీ.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్‌కు సమర్థ నాయకత్వం వహించి, విజయాన్ని సాధించి పెట్టిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను పరోక్షంగా గుర్తు చేశారు. 1946లో చర్చిల్‌ చేసిన 'ఐరన్‌ కర్టన్‌ ప్రసంగాన్ని' ప్రస్తావించారు. ఆ ప్రసంగం సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికినట్లు విశ్లేషకులు చెబుతారు. "నేడు మనకు వినపడుతోంది రాకెట్‌ విస్ఫోటాలు, యుద్ధవిమానాల గర్జన మాత్రమే కాదు.. రష్యాను మిగతా నాగరిక ప్రపంచం నుంచి వేరు చేసే కొత్త 'ఐరన్‌ కర్టెన్‌' పడబోతోంది" అని హెచ్చరించారు.
    రష్యాపై ఐరోపా సంఘం విధించే ఆర్థిక ఆంక్షల్లో విలాసవంతమైన వస్తువులను మినహాయించాలని ఇటలీ ప్రధాని మారియో డ్రాగి విజ్ఞప్తి చేశారు. దీనిపై జెలెన్‌స్కీతో మాట్లాడేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు శుక్రవారం ట్విటర్‌లో బదులిచ్చారు.

"నేడు ఉదయం 10.30 గంటలకు చెర్నిహివ్‌, హొస్టోమెల్‌, మెలిటోపోల్‌ వద్ద భీకర పోరు జరిగింది. ప్రజలు చనిపోయారు. ఈసారి మారియోతో మాట్లాడేందుకు యుద్ధ షెడ్యూల్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తా" అని పేర్కొన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ABOUT THE AUTHOR

...view details