తెలంగాణ

telangana

ETV Bharat / international

'నో ఫ్లై జోన్‌'కు అవకాశం ఎంత? నాటో వెనకడుగుకు కారణమేంటి? - రష్యా యుద్ధం

Ukraine no fly zone: ఉక్రెయిన్​ను నో ఫ్లై జోన్​గా ప్రకటించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ కోరారు. అందుకు నాటో కూటమి అంగీకరించలేదు. మరోవైపు.. నిషిద్ధ గగనతంగా ప్రకటిస్తే నేరుగా యుద్ధంలోకి వచ్చినట్టేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నో ఫ్లై జోన్​ అమలు చేయటం సాధ్యమేనా? దాని వల్ల తలెత్తే పరిణామాలేంటి?

No Fly Zone on Ukraine
నో ఫ్లైజోన్‌

By

Published : Mar 6, 2022, 10:16 AM IST

Ukraine no fly zone: రష్యా వైమానిక దాడుల నుంచి తమ ప్రజలను కాపాడేందుకు 'నిషిద్ధ గగనతలం' (నో ఫ్లై జోన్‌) విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోదనలే అవుతున్నాయి. దీనికి 'నాటో' కూటమి ససేమిరా అంటోంది. మరోవైపు నో ఫ్లై జోన్‌ విధిస్తే తమపై యుద్ధానికి దిగినట్టేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఉక్రెయిన్‌పై నిషిద్ధ గగనతలాన్ని అమలుచేయడం ఎంతవరకు సాధ్యం? దాని వల్ల తలెత్తే విపరిణామాలు ఏమిటి? అనేవి ఆసక్తికర విషయాలు.

ఏమిటీ జోన్‌లు?

నిర్దిష్ట ప్రాంతంలోని గగనతలంలోకి కొన్ని రకాల విమానాల ప్రవేశాన్ని నిషేధించేందుకు 'నో ఫ్లై జోన్‌' నిబంధనలను విధిస్తుంటారు. సాధారణంగా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, సైనిక స్థావరాల వద్ద ఈ నిబంధన అమలవుతుంటుంది. ఆ ప్రాంతాలపై వైమానిక దాడులు లేదా నిఘా కార్యకలాపాలను అడ్డుకోవడం వీటి ఉద్దేశం.

అమలు ఎలా?

ఏ దేశమైనా ఫలానా ప్రాంతాన్ని నిషిద్ధ గగనతలంగా ప్రకటించి మిన్నకుండిపోవడం కుదరదు. దాని అమలుకు ఆయుధ వ్యవస్థలను మోహరించాలి.

  • ఉక్రెయిన్‌లో నో ఫ్లై జోన్‌ను అమలు చేయాలంటే నాటో దేశాలు వందల సంఖ్యలో ఫైటర్‌ జెట్‌లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ(అవాక్స్‌) విమానాలు, గాల్లో ఇంధనం నింపే ట్యాంకర్‌ విమానాలు, రాడార్లు అవసరం. వీటికితోడు భారీగా ఇంధన కేంద్రాలు, విమాన నిర్వహణ వసతులను ఏర్పాటు చేయాలి. వేల సంఖ్యలో సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుంది.
  • నిషిద్ధ గగనతలం చుట్టూ ఈ యుద్ధవిమానాలు గస్తీ తిరగాలి. ఆ ప్రాంతంలోకి చొరబడే విమానాలను క్షిపణులతో కూల్చేయాలి.
  • నో ఫ్లై జోన్‌ అమలుకు నిర్ణయిస్తే.. మొదటే చుట్టుపక్కల ఉన్న రష్యన్‌ వైమానిక దళ సాధన సంపత్తి, ఎస్‌-400 వంటి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు, ఆదేశిక వ్యవస్థలనూ ధ్వంసం చేయాల్సి ఉంటుంది.

నాటోకు ఆ సామర్థ్యం లేదా?

రష్యాతో పోలిస్తే నాటో దళాల వద్ద మెరుగైన యుద్ధవిమానాలు ఉన్నాయి. గగనతలంలో అవి ఆధిపత్యం ప్రదర్శించగలవు. అమెరికా వద్ద ఐదోతరం ఫైటర్‌ జెట్‌లైన ఎఫ్‌-22 రాప్టర్‌, ఎఫ్‌-35 లైట్నింగ్‌లు ఉన్నాయి. రష్యా వద్ద ఉన్న ఎస్‌యూ-57 కన్నా ఇవి సాంకేతికంగా మెరుగైనవే. నాటో వద్ద ఎఫ్‌-16, ఎఫ్‌-15, యూరోఫైటర్‌ యుద్ధవిమానాలూ ఉన్నాయి. ఉక్రెయిన్‌ గగనతలంలో కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన సంఖ్యలో ఫైటర్‌ జెట్‌లు ఈ కూటమి వద్ద ఉన్నాయి.

అమలులో ఇబ్బందేమిటి?

ఉక్రెయిన్‌పై నాటో కూటమి 'నో ఫ్లై జోన్‌' అమలు చేస్తే రష్యా వాయుసేన దాన్ని సవాల్‌ చేస్తుంది. యుద్ధవిమానాలతో 'చొరబాటు'కు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వాటిని నాటో దళాలు కూల్చేస్తాయి. దీన్ని యుద్ధ చర్యగా రష్యా పరిగణిస్తుంది. ఇది అంతిమంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీయవచ్చు. దీనికి నాటో సిద్ధంగా లేదు.

అణు యుద్ధ ముప్పూ కారణమా?

తమ జోలికి వస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికే హెచ్చరిక చేసిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. నో ఫ్లై జోన్‌ విధింపు.. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. అందువల్ల పుతిన్‌ సేనతో నేరుగా తలపడటం కన్నా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించడం, రష్యాను ఆంక్షలతో కుంగదీయడం, అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

గతంలో ఎక్కడైనా విధించారా?

  • 1991లోమొదటి గల్ఫ్‌ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్రపక్షాలు ఇరాక్‌లోని రెండు ప్రాంతాల్లో 'నో ఫ్లై జోన్‌' విధించాయి. అక్కడ ఉంటున్న కొన్ని వర్గాల ప్రజలను ఇరాక్‌ వైమానిక దాడుల నుంచి రక్షించడానికి ఈ చర్యను చేపట్టాయి. దీనికి ఐరాస ఆమోదం లేదు. నాడు ఇరాక్‌ యుద్ధవిమానాలు తరచూ ఈ నోఫ్లై జోన్‌ను సవాల్‌ చేసేవి. దీంతో వాటిపై ప్రతి దాడి ఉండేది. ఈ క్రమంలో రెండేసి చొప్పున మిగ్‌, సుఖోయ్‌-22 యుద్ధవిమానాలను ఇరాక్‌ కోల్పోయింది.
  • 1992లో బాల్కన్‌ పోరు జరుగుతున్న సమయంలో బోస్నియా గగనతలంలోకి అనుమతి లేని సైనిక విమానాల రాకపోకలను నిషేధిస్తూ ఐరాస తీర్మానం చేసింది. దీన్ని నాటో దళాలు అమలు చేశాయి.
  • 2011లో ఐరాస భద్రతా మండలి.. లిబియాలో 'నో ఫ్లై జోన్‌' విధించింది. గఢాఫీ దళాలు పౌరులపై దాడి చేయకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నిబంధనల అమలు బాధ్యతనూ నాటో చేపట్టింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details