Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఆరో రోజైన మంగళవారం రష్యా మరింత దూకుడు పెంచింది. 56 రాకెట్లు, 113 క్షిపణులను ఉక్రెయిన్ నగరాలపై ప్రయోగించి పెను విధ్వంసాన్ని మిగిల్చింది. అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ఇంతవరకు 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఒకపక్క కీవ్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క.. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌పైనా రష్యా మళ్లీ గురిపెట్టింది. క్షిపణి దాడిలో ఆ నగర నడిబొడ్డున ఉన్న అతిపెద్ద భవంతి 'ఫ్రీడం స్క్వేర్' నామరూపాల్లేకుండా పోయింది. దాడి సమయంలో అదొక అగ్నిగోళాన్ని తలపించింది. కనీసం ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తున్నా ఈ దాడిలో ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. సోవియెట్ యూనియన్ హయాం నుంచి పరిపాలన కేంద్రంగా ఈ భవంతి ఉంది. అక్కడి ప్రసూతి వార్డును.. బాంబుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతంగా అప్పటికప్పుడు మార్చారు. '..ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య. దీనిని ఎవరూ మరిచిపోలేరు. ఎవరూ క్షమించలేరు. మేమేంటో రుజువు చేసుకుంటున్నాం' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు ఉక్రెయిన్ మీదుగా వెళ్లకుండా పూర్తిస్థాయి నిషేధం విధించాలని నాటోను కోరారు. కీవ్‌లో ఒక టీవీ టవర్‌పైనా దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. పుతిన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఫోన్‌లో మాట్లాడి సైనిక దాడి ముగించాలని మరోసారి సూచించారు.
క్లస్టర్ బాంబుల్ని ప్రయోగించారా?
నగరాలపై దాడులకు దిగడంతో పాటు మూడు జన సమ్మర్థ ప్రాంతాలపై క్లస్టర్ బాంబుల్ని రష్యా వాడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే రష్యాపై ఇతర దేశాలు మరింతగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పౌరుల ఆవాసాలు, ఆసుపత్రులు, పాఠశాలలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలే తమ లక్ష్యమని రష్యా పదేపదే చెబుతోంది. వీడియో దృశ్యాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. లక్ష్యాన్ని సాధించేవరకు వెనక్కి తగ్గబోమని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగానూ స్పష్టం చేయడం గమనార్హం. బెలారస్ నుంచి సైనిక బలగాలు యుద్ధంలోకి దిగాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపినా తదుపరి వివరాలు వెల్లడించలేదు. ఖేర్సన్ ప్రధాన ఓడరేవును రష్యా స్తంభింపజేసిందని తెలిపాయి. పిల్లల్ని చంపడానికి క్షిపణులు ప్రయోగించడం ద్వారా రష్యా అనాగరిక, విచక్షణ రహిత విధానాలు అనుసరిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుపట్టారు.
ఇసుక నింపిన ట్రాక్టర్ టైర్లతో అడ్డంకులు
రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్ ప్రజలు జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో ట్రాక్టర్ టైర్లలో ఇసుక నింపి అడ్డంగా వేస్తున్నారు. ఇసుక బస్తాలనూ దీనికోసం వాడుతున్నారు. 'రష్యా సైనికుడా.. ఆగు! మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకో. నిష్కళంక అంతరాత్మతో ఇంటికి వెళ్లు' వంటి అర్థమిచ్చే నినాదాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. తాగునీటి సరఫరా మార్గాలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలపైనా రష్యా దాడి చేయడంతో అనేకమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు పంపిణీ తీగలకు సమీపంలో ఉన్న ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని రష్యా సూచించింది.
5 వేల మంది సైనికుల్ని కోల్పోయిన రష్యా!
యుద్ధంలో దాదాపు 5,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, ఉక్రెయిన్‌కు పట్టుబడడమో జరిగి ఉంటుందని సీనియర్ నిఘా విభాగ అధికారి ఒకరు అంచనా వేశారు. కీవ్-ఖర్కివ్ నగరాల మధ్యనున్న ఒఖ్తిర్కా సైనిక స్థావరంపై రష్యా పదాతిదళం ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణితో జరిపిన దాడిలో సుమారు 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు వెలుగుచూసింది.
ఆ గుర్తులు ఉన్నాయేమో చూడండి
ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లో భవనాలపై ఎర్ర రంగుతో వేసిన ఇంటూ, బాణం గుర్తులు కనిపించిన నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రష్యన్ సేనలు వాటిపై దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు తాము నివసించే భవనాల పైకప్పులపై ఏమైనా అనుమానాస్పద గుర్తులుంటే వాటిని తక్షణం కప్పివేయాలని సూచించింది.
భద్రతా మండలి నుంచిరష్యా తొలగింపునకు బ్రిటన్ ప్రతిపాదన