తెలంగాణ

telangana

ETV Bharat / international

నాలుగో రోజుకు చేరిన యుద్ధం- చర్చలకు రష్యా ఆహ్వానం - ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలు

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో ఇరు దేశాల సైన్యాలు హోరాహోరీ తలపడుతున్నాయి. సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా పదాతిదళాలు.. దాడులు చేస్తుండగా.. అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ సైన్యం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. రాజధాని కీవ్‌కు సమీపంలో రష్యా దాడులు చేస్తోంది. రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉన్న రెండు ప్రదేశాల్లోనూ పోరు సాగుతోంది.

Russia Ukraine War
ఖార్కివ్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు

By

Published : Feb 27, 2022, 1:59 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో బాంబుల మోతలు ఆగడం లేదు. క్షిపణులు, శతఘ్నులు, ట్యాంకులతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌వైపు.. రష్యా సేనలు దూసుకువస్తున్నాయి. యుద్ధంలో భాగంగా సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా పదాతిదళాలు ఉక్రెయిన్‌ ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల వైపు వెళ్తున్నాయి. కీవ్‌కు దక్షిణాన ఆదివారం భారీ పేలుళ్లు సంభవించాయి. కీవ్‌కు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలోని జులియానీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న చమురు డిపోలో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఖార్కివ్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చివేసినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ప్రజలు తమ ఇళ్ల కిటికీలను మూసివేసి.. పొగ నుంచి రక్షణపొందాలని వివరించింది.

.

ఉక్రెయిన్​లో కర్ఫ్యూ..

కీవ్‌ నగరంతో పాటు ఉక్రెయిన్‌ తీరప్రాంతంపై రష్యా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సముద్ర మార్గం ద్వారా రష్యా నౌకాదళం దాడి చేయవచ్చనే ఆందోళనతో ఉక్రెయిన్‌ సైన్యం అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. రష్యా దళాల దాడులను ముందే పసిగట్టిన ఉక్రెనియన్లు.. ఇళ్లు, బంకర్లు, సబ్‌వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. అటు.. ప్రజలు వీధుల్లోకి రాకుండా ఉండేందుకు సోమవారం ఉదయం వరకు ఉక్రెయిన్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ముందుకొచ్చాయి. సైనిక సామాగ్రి సహా.. అదనంగా 350 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు ఇస్తామని అమెరికా ప్రకటించింది. రష్యాకు చెందిన శక్తిమంతమైన సంపన్నులు, కంపెనీలకు చెందిన ఆస్తులను వేటాడేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రిని పంపుతామని జర్మనీ, ఫ్రాన్స్‌ ప్రకటించాయి.

.

పుతిన్ దుందుడుకు చర్యలకు ప్రతికారంగా స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగిస్తూ ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రష్యా బ్యాంకింగ్‌ రంగం అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం చాలా కష్టంగా మారిపోయింది. ఆంక్షల నుంచి తట్టుకొనేలా చేసేందుకు రష్యా పోగు చేసిన 600 బిలియన్‌ డాలర్లు విలువైన రిజర్వులను ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వినియోగించకుండా చేయాలనే లక్ష్యంతో ఈ బ్యాన్‌ విధించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

.

పుతిన్ ప్లాన్​ అదే..

ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతిమ లక్ష్యాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. అక్కడ సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రష్యా దళాలు ఎంత భూభాగాన్ని అక్రమించుకున్నాయనే విషయంలో స్పష్టత లేదు.

చాలాచోట్ల.. రష్యా సైన్యాన్ని తిప్పికొట్టామని, రాజధాని కీవ్‌లో మాత్రం హోరాహోరీ పోరు సాగుతోందని ఉక్రెయిన్‌ తెలిపింది. అయితే సరిహద్దులో మోహరించిన రష్యా దళాల్లో సగానిపైగా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి తెలిపారు.

.

కీవ్‌ నగరం నడిబొడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఎక్కువగా మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఇప్పటివరకూ..తమవైపు 198 మంది చనిపోయారని, వెయ్యికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా మాత్రం ఈ విషయాలను వెల్లడించలేదు.

ఉక్రెయిన్​కు అండగా మస్క్..

Elon Musk Ukraine: రష్యాతో వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్​ను బాసటగా నిలిచారు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌. స్టార్​లింక్ శాటిలైట్ బ్రాడ్​బ్యాండ్ సైవల్ని ప్రారంభించి ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

.

ఉక్రెయిన్​తో చర్చలకు..

ఉక్రెయిన్​తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్ ప్రతినిధులతో ​చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధమైంది. ఈ మేరకు బెలారస్ నగరంలోని హోమెల్​కు చేరుకున్నారు రష్యా ప్రతినిధులు. ఇక్కడే ఉక్రెయిన్​ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఇవీ చూడండి:

మరో క్షిపణి ప్రయోగంతో ఉద్రిక్తతలు రాజేసిన కిమ్ దేశం

యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు మస్క్‌ సాయం.. ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details