తెలంగాణ

telangana

ETV Bharat / international

4నగరాల్లో కాల్పులకు విరామం- మిగతా చోట్ల విధ్వంసం - పుతిన్ వార్తలు

RUSSIA UKRAINE WAR: ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులతో విరుచుకుపడుతున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. మిలిటరీ, క్షిపణి, వైమానిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతుండగా మార్గమధ్యలో కొందరు మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా నాలుగు నగరాల్లో కాల్పులకు రష్యా తాత్కాలిక విరామం ప్రకటించింది. ఆయా నగరాల శివారు ప్రాంతాలతోపాటు మిగతాచోట్ల మాత్రం రష్యా తన ప్రతాపం చూపుతూనే ఉంది. మరోవైపు, రష్యా కాల్పుల విరమణను తిరస్కరించిన ఉక్రెయిన్... రష్యా వెళ్లడానికి తమ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేసింది.

RUSSIA UKRAINE WAR
RUSSIA UKRAINE WAR

By

Published : Mar 7, 2022, 11:00 PM IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై.. పట్టుసాధించేందుకు రష్యా సేనలు ముందుకు సాగుతుండగా.. జెలెన్‌స్కీ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. కీవ్‌లో శరణార్థుల తరలింపునకు ఉపయోగిస్తున్న ఇర్పిన్‌ నదిపై ఉన్న వంతెనపై రష్యా సేనలు మోర్టర్‌ షెల్స్‌తో దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నది దాటాలని భావించిన వందలాది మంది ఉక్రెయినియన్లు వంతెనకు ఒక వైపు నిలిచిపోయినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి.

సరిహద్దు దాటిన తర్వాత చిన్నారిని పట్టుకొని ఏడుస్తున్న బామ్మ
చిన్నారిని జాగ్రత్తగా పట్టుకొని పరిగెడుతున్న ఉక్రెయిన్ పోలీసు

9 మంది మృతి

వినిత్సియా నగరంలోని విమానాశ్రయంపై రష్యా వైమానిక దాడి జరపగా... 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. కీవ్‌కు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైకలోవ్‌ పట్టణంపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. నివాస భవనాలపైనా కాల్పులు జరుపుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం ఆరోపించింది. కీవ్‌ శివారులోని ఇర్పిన్‌పైనా దాడులు కొనసాగుతుండగా.. గత మూడురోజుల నుంచి అక్కడ విద్యుత్‌, మంచినీటి సరఫరా నిలిచిపోయిందని ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.

దేశం దాటి వెళ్తున్న ప్రజలు
వలసదారులు

రెండు లక్షల మంది వలస!

రష్యా దాడులతో లక్షలాది ఉక్రెయిన్‌ ప్రజలు దేశం వీడి వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్‌లోని మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా సైన్యం విరుచుపడగా.. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. సుమారు రెండు లక్షల మంది ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా వేసింది. కొంతమంది రష్యా క్షిపణులు, బాంబు దాడులకు బలవుతున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది. ఖార్కివ్‌ వంటి నగరాల్లో సూట్‌కేసుల మధ్య ప్రజల మృతదేహాలు పడి ఉండడం వంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఓ వ్యక్తిని చక్రాల కుర్చీలో తీసుకెళ్తున్న ఉక్రెయిన్ సైనికులు

రష్యాను క్షమించబోం: జెలెన్​స్కీ

పదిరోజులుగా రష్యా చేస్తున్న దాడుల్లో వేలాది మంది ప్రజలు చనిపోయారని, వారిలో 38 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు వివరించింది. రష్యా చేస్తున్న యుద్ధంలో వేలాది మంది ప్రజలు మరణించడం పట్ల అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న హత్యలేనని..., ఈ విషయంలో రష్యాను ఎప్పటికీ క్షమించబోమని తెలిపారు. తమ గడ్డపై దారుణాలకు పాల్పడుతున్న ప్రతిఒక్కరినీ కచ్చితంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

కాల్పుల శిక్షణ పొందుతున్న ఉక్రెయిన్ పౌరులు

లక్ష్యాలు సాధిస్తాం: పుతిన్

ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లో సాధించుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. చర్చల ద్వారానైనా లేదా యుద్ధం ద్వారానైనా వీటిని సాధించుకుంటామని తెలిపారు. మరోవైపు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌, సుమి నగరాల్లో కాల్పులకు రష్యా తాత్కాలిక విరామం ప్రకటించింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా సైన్యం తెలిపింది. కీవ్‌, ఖార్కివ్‌ నుంచి రష్యా, బెలారస్‌ వెళ్లాలనుకునే వారిని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లుచేస్తామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రజలు తరలివెళ్లే ప్రక్రియను డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొంది. కాల్పుల విరమణను ఎప్పటివరకూ కొనసాగిస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

ఇదీ చదవండి:రష్యా చేజారిన ఎయిర్​పోర్ట్- యుద్ధంలో 406 మంది పౌరులు మృతి

ABOUT THE AUTHOR

...view details