Russia-Ukraine live news: ఉక్రెయిన్- రష్యా సేనల మధ్య పోరు హోరాహోరీగా పోరు సాగుతోంది. రాజధాని కీవ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ దళాలు తిప్పికొడుతున్నాయి. ఫలితంగా తుపాకులు, బాంబుల మోతతో కీవ్ దద్దరిల్లుతోంది. విక్టరీ అవెన్యూలో ఉన్న ఉక్రెయిన్ సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఈ దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ఆగ్నేయ జపోరిజ్జియా ప్రాంతంలోని మెలిట్పోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఈమేరకు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఒక వైపు రాజధానిపై దాడి చేస్తూనే.. మరోవైపు ప్రధాన నగరాలను ఆక్రమిస్తోంది రష్యా. కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో ప్రజలు ప్రధాన నగరాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
కీవ్ సహా పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సైతం దాడులు కొనసాగాయి. ఉదయం రెండు నుంచి నాలుగు గంటల సమయంలో కీవ్‌లోని పశ్చిమ , దక్షిణ ప్రాంతాల్లో భారీ పేలుళ్ళు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కీవ్‌లోని అధ్యక్ష కార్యాలయానికి 800 మీటర్ల దూరంలో పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది.
భీకర పోరు నేపథ్యంలో కీవ్‌లోని ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఉక్రెయిన్ సైన్యం సూచించింది. బాంబులు, బుల్లెట్ల కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఈ మేరకు పిలుపునిచ్చింది.
Russia attack Ukraine
కీవ్‌లోని బెరెస్టీస్కాలో ఆక్రమణ దారులకు చెందిన పరికరాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకు, ఆయుధాలతో ఉన్న రెండు కార్లు, రెండు ట్రక్కులు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్ దక్షిణతీర ప్రాంతంలో జపనీస్ సంస్థకు చెందిన ఓ కార్గో నౌక దాడుల్లో ధ్వంసమైంది. ఈ దాడిలో నౌకలోని 20 మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నౌక యాజమాన్యం సైతం ఈ ఘటనను ధ్రువీకరించింది.
మరోవైపు వాసిల్కివ్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ సైన్యాల మధ్య భీకర పోరాటం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. Il-76 అనే భారీ రవాణా విమానాన్ని కీవ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసిల్కివ్ సమీపంలో నేలకూల్చినట్లు తెలిపింది. బిలా త్సెర్‌కెవా ప్రాంతంలో మరో రష్యా సైనిక రవాణా వాహనాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిపై రష్యా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Russia Ukraine News
'కీవ్ వదిలి పారిపోను'
అటు కీవ్‌ను వదిలివెళ్లాలంటూ అమెరికా చేసిన సూచనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నిరాకరించారు. పోరాటం ఇక్కడే ఉందన్న జెలెన్స్కీ తనకు ఆయుధాలు కావాలని, పారిపోవడానికి సాయం కాదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ కోసం తమ పోరాటాన్ని ఆపబోమని, ఆయుధాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైనికులు రష్యాకు లొంగిపోవాలని అధ్యక్షుడు పిలుపునిచ్చినట్లు వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు మరో వీడియోను పోస్ట్ చేశారు.