Russia Ukraine war: యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ఓడరేవును, ఆ నగరాన్ని పూర్తి నియంత్రణలో తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. నల్ల సముద్రం తీరంలోని ఈ ఓడరేవు కీలకమైనది. తీరంతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేయాలని వారం రోజులుగా రష్యా ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం పోర్టుతో పాటు ఖేర్సన్ పాలన యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకుందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధం మొదలయ్యాక ఇలా ఒక నగరం రష్యా చేతిలోకి వెళ్లడం ఇదే ప్రథమం. పరిస్థితిని నియంత్రించడంపై అక్కడి అధికారులతో రష్యా కమాండర్లు చర్చలు జరుపుతున్నారు. దీనిని ఉక్రెయిన్ సైనిక వర్గాలు ఖండిస్తున్నాయి.
మరియుపొల్, ఖర్కివ్ నగరాలనూ రష్యా ఇప్పటికే దిగ్బంధం చేసింది. ఖార్కివ్‌లో మరింత చొచ్చుకుపోయేందుకు రష్యా దళాలు చేసిన ప్రయత్నాన్ని నిలువరించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రాకెట్లు, క్షిపణులతో ఆ నగరంపై రష్యా ముమ్మరంగా దాడి చేసిందని తెలిపింది. యుద్ధంలో ప్రాణనష్టంపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మరికొన్ని వివరాలు తెలిపింది. 6,000 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెప్పడాన్ని ఖండించింది.తమ దళాలకు చెందిన దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోగా, 1,600 మంది గాయపడ్డారని ప్రకటించింది. రష్యా సైనిక ఉన్నతాధికారి మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ కూడా ప్రాణాలు కోల్పోయినవారిలో ఉన్నారు. నష్ట తీవ్రతను రష్యా బాగా తగ్గించి చూపిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది.
ఆసుపత్రిపై క్షిపణులతో దాడి
ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌లో ఒక ఆసుపత్రిపై రెండు క్రూజ్ క్షిపణులు దాడి చేశాయి. ప్రధాన భవంతి దెబ్బతింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మరియుపొల్‌లో పాఠశాల సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్న వారిపై బాంబులు కురిపించారు. కీవ్, ఖర్కివ్‌లపైనా పలు చోట్ల దాడులు జరిగాయి. నిర్వహణలో ఉన్న నాలుగు అణు విద్యుత్తు కర్మాగారాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అక్కడే ఆగిన సైనిక వాహనాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు 40 మైళ్ల పొడవునా సైనిక వాహనాలతో దండయాత్రకు వస్తున్న రష్యా.. వాటిని ఆ నగరానికి 25 కి.మీ. దూరంలో నిలిపి ఉంచింది. రెండ్రోజులుగా అవి అక్కడి నుంచి కదలడం లేదు. ఆహారం, ఇంధన కొరత కూడా దీనికొక కారణమని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ నగరంపై క్షిపణుల వర్షం మాత్రం ఆపడం లేదు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పొద్దుపోయాక శక్తిమంతమైన పేలుడు చోటు చేసుకుంది. ఆ సమయంలో తరలింపు పనుల్లో భాగంగా వందల మంది మహిళలు, పిల్లలు అక్కడ ఉన్నా అదృష్టం కొద్దీ వారు సురక్షితంగా బయటపడ్డారు. ఉక్రెయిన్-రష్యా మధ్య రెండోవిడత చర్చలు బెలారస్‌లో మొదలయ్యాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్లను నిర్వహించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి మార్గాలు ఉన్న ప్రాంతాల్లో కాల్పుల విరమణను పాటించేందుకు అంగీకారం తెలిపాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు బృందాలు కరచాలనం చేసుకున్న దృశ్యాలను జెలెన్‌స్కీ కార్యాలయం విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో 2013 నుంచి ఇప్పటివరకు యుద్ధ నేరాలేమైనా జరిగాయా అనేది తేల్చడానికి అంతర్జాతీయ నేర న్యాయస్థానం దర్యాప్తు ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో 227 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.
ఏకాకి అవుతున్న రష్యా
ప్రపంచ దేశాలు, కొన్ని కూటములు విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఏకాకి అవుతోంది. ఆర్థిక పరిస్థితి ఇప్పటికే సంక్షుభితంగా మారింది. చైనా, బెలారస్, మరికొన్నింటిని మినహాయిస్తే మిత్ర దేశాలనేవి రష్యాకు లేకుండా పోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ బ్యాంకు ఒకటి ఐరోపా మార్కెట్ల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. రష్యా, బెలారస్‌లపై అదనపు ఆంక్షల్ని విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. రష్యాపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మండిపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. రష్యా విమానయాన సంస్థలకు విమానాల విడి భాగాల సరఫరా, సాంకేతిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌బస్, బోయింగ్ ప్రకటించాయి. రష్యా నుంచి ఇంధన దిగుమతులపై విధించిన ఆంక్షల్ని జర్మనీ వ్యతిరేకించింది.
ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించిన వార్తల ప్రసారంలో రష్యాను విమర్శించేలా వ్యవహరించినందుకు ఒక రేడియో స్టేషన్‌ను, ఒక టీవీ ఛానల్‌ను ప్రభుత్వం మూసివేయించింది. అధికారికంగా తాము ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలని ప్రసార మాధ్యమాలకు పుతిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘తప్పుడు వార్తలు’’ ప్రచురించేవారికి 15 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించేలా నిబంధన తీసుకురానున్నారు. ఈ నెల 13 నుంచి నార్వేలో జరిగే నాటో దేశాల బలగాల కసరత్తుకు పరిశీలక దేశంగా హాజరయ్యేందుకు రష్యా నిరాకరించింది.