త్రుటిలో తప్పిన అణుగండం- ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు - Russia Invasion
Russia Ukraine War: ఉక్రెయిన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు రష్యా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడటం లేదు. ఐరోపా ఖండంలోని అతిపెద్ద అణు రియాక్టర్ అయిన జాపోరిషియాపై రష్యా దళాల దాడే అందుకు నిదర్శనం. తాజా పరిణామంతో ఐరోపాతో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అణుకేంద్రంపై దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయినా వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్‌లోని పలు కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
Russia Ukraine War
By
Published : Mar 5, 2022, 4:58 AM IST
|
Updated : Mar 5, 2022, 6:44 AM IST
Russia Ukraine War: కొరకరాయి కొయ్యలా మారిన ఉక్రెయిన్‌ను ఎలాగైనా లొంగదీసుకునేందుకు... రష్యా మరింత భీకరంగా దాడులు చేస్తోంది. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన ఉక్రెయిన్‌లోని 'జపోరిజియా'పై శుక్రవారం తెల్లవారుజామున బాంబులు కురిపించింది. ఈ ధాటికి అక్కడున్న ఓ రియాక్టర్‌లో మంటలు చెలరేగాయి. ఇక్కడ పేలుడు సంభవిస్తే... చెర్నోబిల్‌లో జరిగిన దానికంటే పదిరెట్లు ఎక్కువ నష్టం వాటిల్లేదని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఐరోపా ఉలిక్కిపడింది. వెంటనే ఐరాస భద్రతా మండలిని సమావేశపరచాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డిమాండ్ చేశారు. అణుకేంద్రంపై దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కాగా, రాజధాని కీవ్‌తో పాటు ఇతర కీలక నగరాలపైనా రష్యా దాడుల తీవ్రతను పెంచింది. పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగిస్తోంది.ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను అమలు చేయాలన్న ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అభ్యర్థనను నాటో నిరాకరించింది. తమ సైనిక చర్యపై అంతర్జాతీయంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలుశిక్ష విధించాలన్న బిల్లుకు రష్యా పార్లమెంటు ఆమోదం తెలిపింది.
ఇంధన, విద్యుత్తు సరఫరాలపై..
ఉక్రెయిన్‌లోని ఇంధన, విద్యుత్తు సరఫరాలను దెబ్బతీసేందుకు పుతిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం భారీ గ్యాస్ పైపులైన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆ సైనికులు, ఒఖిటర్కాలోని విద్యుత్ కేంద్రంపై దాడులు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటును సమీపించి, శతఘ్నులను ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారని, ఎలాంటి రేడియేషన్ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన అణు రియాక్టర్ ప్రస్తుతం వినియోగంలో లేదు. కానీ, అందులో అణు ఇంధనం ఉంది. ఇక్కడ పేలుడు సంభవిస్తే పెను విధ్వంసం తప్పదని అణు కేంద్రం ప్రతినిధి అండిరీ టూజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంటులోని కీలక పరికరాలపై దాడులు ప్రభావం లేదని, పేలుడు సంభవించకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది.
దెబ్బతిన్న జపోరిజియాలోని అణువిద్యుత్తు కర్మాగార పరిపాలనా భవనం
ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు
Russia Invasion: తాజా పరిణామంతో ఐరోపా సహా పలు దేశాలు ఉలిక్కిపడ్డాయి. జపోరిజియా దాడి విషయం తెలిసిన వెంటనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్... జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా యావత్ ఐరోపాకూ ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా కృషి చేస్తామని అభయమిచ్చారు. అణు కేంద్రంపై దాడి జరిగినందున, ఐరాస భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా జెలెన్‌స్కీకి ఫోన్‌చేసి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అమెరికా ఇంధనశాఖ తన అణు సంఘటన ప్రతిస్పందన బృందాన్ని అప్రమత్తం చేసింది!
కీవ్‌లో బాంబుల మోత
Russia Ukraine War update: రాజధాని కీవ్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పది నిమిషాలకోసారి బాంబుల మోత వినిపిస్తోంది. ఈ ధాటికి భవనాల పైకప్పులు అదిరిపోతున్నాయి. దేశంలోని ఇతర ముఖ్య నగరాలను చేజిక్కించుకునేందుకూ పుతిన్ సేనలు శక్తిమంతమైన ఆయుధాలను ప్రయోగిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది నగరాలపై దృష్టి సారించి.. సముద్రతీరంతో ఉక్రెయిన్ సంబంధాన్ని తెగ్గోసేలా ఒక్కో ప్రాంతాన్నీ ఆక్రమిస్తున్నాయి. చెర్నిహివ్‌లోని నివాస ప్రాంతాలపై బాంబులు కురిపించడంతో 33 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
దొనెట్స్క్‌లోని వాల్నవాఖా ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికుల కూల్చివేసిన రష్యా యుద్ధ విమానం
నల్లసముద్రపు ఓడరేవు ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. మరో ముఖ్యనగరం మరియుపోల్‌లో శుక్రవారమూ భీకర దాడులు కొనసాగాయి. రష్యా బలగాలను ఎదుర్కోవాల్సిన విషయమై ఉక్రెయిన్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలిస్తున్నారు. చెట్లను కూల్చి, బారికేడ్లు పెట్టి ఇళ్లను రక్షించుకోవాలని, చాటు నుంచి శత్రుమూకలపై దాడులు చేపట్టాలని తాజాగా సూచనలు జారీచేశారు.
పేలుడు గురించే భయపడుతున్నాను: జెలెన్‌స్కీ
జపోరిజియా అణు కేంద్రంపై దాడి క్రమంలో జెలెన్‌స్కీ వీడియో ద్వారా ఉద్వేగపూరిత సందేశమిచ్చారు. "శత్రు మూకలపై మా సైనికులు, ప్రజలు అత్యుత్తమంగా పోరాడుతున్నారు. రష్యన్ ట్యాంకర్లు నేరుగా అణు కేంద్రంపై దాడి చేశాయి. ఐరోపానూ, ఐరోపాలోని ప్రతి వ్యక్తినీ అంతంచేసే పేలుడు సంభవిస్తుందేమోనని భయపడుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
మరో ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు...
ఉక్రెయిన్‌లో మానవ హక్కుల స్థితిగతుల పర్యవేక్షణకు ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్మానంపై ఐరాస మానవహక్కుల మండలి ఓటింగ్ చేపట్టింది. దీనికి అనుకూలంగా 32 దేశాలు, వ్యతిరేకంగా రష్యా, ఎరిత్రియాలు ఓటు వేశాయి. భారత్ సహా మొత్తం 13 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. యుద్ధ నేరాలకు పాల్పడిన పుతిన్‌పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ మాజీ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ పేర్కొన్నారు. కాగా, బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, రేడియో ఫ్రీ యూరప్, రేడియో లిబర్టీ తదితర వెబ్‌సైట్లను రష్యా నిషేధించింది. తాజా ఘటనతో ఉక్రెయిన్‌లోని అణు వ్యవస్థల భద్రత, పరిరక్షణ పట్ల చైనా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
జపోరిజియా అణు కేంద్రంపై రష్యా దాడిని నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఖండించారు. ఇది యుద్ధ నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను అమలు చేయాలన్న జెలెన్‌స్కీ అభ్యర్థనను తోసిపుచ్చారు.
ఉక్రెయిన్ అణు కేంద్రంపై దాడి క్రమంలో పొరుగున్న ఉన్న పోలండ్‌లోని ఔషధ దుకాణాలకు జనం పోటెత్తుతున్నారు. రేడియేషన్ నుంచి రక్షణ పొందేందుకు అయోడిన్ మాత్రలు తీసుకోవాలా అని అడుగుతున్నారు. పలు ఐరోపా దేశాలు కూడా తమ చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవసరమైన అయోడిన్ సిద్ధపాటు చర్యలు చేపట్టాయి.