Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టినట్లు ప్రకటించిన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో నియో-నాజీలు అనే పదాన్ని వాడారు. ఉక్రెయిన్‌లో నియో-నాజీలను అంతం చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా రష్యా ప్రకటనల్లో పలుసార్లు ఆ ప్రస్తావన వచ్చింది. ఇటీవల ఓ ప్రసూతి ఆసుపత్రిపై దాడి చేసిన సమయంలో కూడా సమర్థించుకొనేందుకు.. నియో-నాజీలు దానిని ఆక్రమించారని పేర్కొంది. అసలెవరు ఈ నియో-నాజీలు..? వారిపై పుతిన్‌కు ఎందుకంత కోపం..? ఉక్రెయిన్ చేసిన తప్పేంటీ..? మేరియుపోల్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా మొదటి నుంచి తీవ్ర స్థాయిలో దాడులు ఎందుకు చేస్తోంది..? ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరి ఎందుకు బయటపడుతోంది..?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చాలా చోట్ల నాజీ ఆలోచనా తీరు అంతంకాలేదు. చాలా సాంప్రదాయ, మిలిటెంట్, రాజకీయ గ్రూపులు ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి.. శ్వేత జాతి అహంకార ధోరణిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి వాటిని నియో-నాజీ గ్రూపులు అంటారు. ఉక్రెయిన్‌లో కూడా ఇటువంటి ఒక సాయుధ గ్రూపు 2014 నుంచి పనిచేస్తోంది. దానిపేరు అజవో బెటాలియన్..!
2014 మేలో తూర్పు ఉక్రెయిన్‌లో పేట్రియాట్ ఆఫ్ ఉక్రెయిన్, సోషల్ నేషనల్ అసెంబ్లీ అనే గ్రూపుల నుంచి వచ్చిన వారితో అజోవ్ బెటాలియన్ ఏర్పాటు చేశారు. జాతి విద్వేష, నియో-నాజీ భావజాలం వ్యాప్తి చేయడం, శరణార్థులపై, రోమా జాతి ప్రజలపై, తమను వ్యతిరేకించే వారిపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. వీరు ఓ బెటాలియన్ వలే డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదులపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు రష్యా అనుకూల వేర్పాటు వాదుల నుంచి మేరియుపోల్ పోర్టు సిటీని స్వాధీనం చేసుకొన్నారు. దీంతో వీరిని 2014 నవంబర్‌లో ఉక్రెయిన్ నేషనల్ గార్డ్స్ విభాగంలో కలిపారు. నాటి అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో వీరిని పొగడ్తలతో ముంచెత్తారు. 'వీరు మా అత్యుత్తమ యోధులు' అంటూ పేర్కొన్నారు.
ఎవరు ప్రారంభించారు..
ఈ అజోవ్ విభాగాన్ని ఆండ్రీ బిలెన్స్కీ ప్రారంభించారు. ఇతను పెట్రియాట్ ఆప్ ఉక్రెయిన్(2005), ఎస్‌ఎన్‌ఏ(2008) రెండింటిలో నాయకుడిగా పనిచేశాడు. ఉక్రెయిన్‌లో మైనార్టీ గ్రూపులపై దాడి చేయడంలో ఎస్‌ఎన్‌ఏ పాత్ర ఎక్కువ. 2010లో ఓ సందర్భంలో బిలెన్స్కీ వివాదాస్పద ప్రకటన చేశాడు. "తక్కువ స్థాయి జాతులకు వ్యతిరేకంగా జరిగే చివరి క్రూసేడ్‌లో శ్వేతజాతీయులు నాయకత్వం వహించడం" ఉక్రెయిన్ జాతీయ లక్ష్యంగా ప్రకటించినట్లు అల్-జజీరా పత్రిక కథనంలో పేర్కొంది. బిలెన్స్కీ 2014లో ఉక్రెయిన్ పార్లమెంట్‌కు ఎంపికయ్యాడు. అక్కడి చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధి పోలీస్, సైన్యంలో అధికారిగా ఉండకూడదు. అందుకే అజోవ్ యూనిట్ నుంచి బయటకు వచ్చేశాడు. 2019 వరకు అతడు ఎంపీగా పనిచేశాడు. 2016లో అతివాద నేషనల్ కార్ప్స్ పార్టీని ప్రారంభించాడు. దీనిలో అజోవ్ బెటాలియన్ సభ్యులే కీలక పాత్ర పోషించారు.
ఉక్రెయిన్ ఒలిగార్క్‌ల నుంచి నిధులు..