Russia Ukraine war: ఉక్రెయిన్ సంక్షోభం క్రమంగా అణు ముప్పు వైపు మళ్లుతోంది. రష్యా సేనలు తాజాగా ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్తు కేంద్రంపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలో సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఏ దేశమైనా రష్యాపై అణుదాడి చేసినా.. వారిపై తక్షణమే ప్రతిదాడి చేసేలా 'డెడ్‌హ్యాండ్' అనే అత్యంత ప్రమాదకర వ్యవస్థను సోవియట్ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. ప్రత్యర్థులు రష్యాపై అణుదాడి ఆలోచన చేయడానికి కూడా భయపడేలా ఈ వ్యవస్థను రూపొందించారు. కొన్నాళ్ల క్రితం వాషింగ్టన్ పోస్టు ప్రతినిధి రష్యాలో ఉండి పరిశోధించి.. 2009లో 'డెడ్‌హ్యాండ్' వ్యవస్థపై ఏకంగా పుస్తకం రాశారు.
ఏమిటీ డెడ్‌హ్యాండ్..?
రష్యా వద్ద అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వీటిల్లో స్ట్రాటజిక్ బాంబర్లు, నూక్లియర్ సబ్‌మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఇందుల్లో కొన్ని ఆటోమేటిక్‌గ్గా శత్రువులపై దాడిచేయగలవు. అటువంటి వ్యవస్థను రష్యా సిద్ధం చేసింది.
నాటి సోవియట్ (ప్రస్తుతం రష్యా)వంటి దేశంపై అణుదాడి చేస్తే.. మళ్లీ అది ప్రతిదాడి చేసే అవకాశం ఇచ్చేందుకు ఏ దేశం ఇష్టపడదు. ఈ క్రమంలో భారీ ఎత్తునే అణుదాడి జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా అణుదాడికి ఆదేశాలు జారీ చేసే నూక్లియర్ కమాండ్ మొత్తాన్ని అంతం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. కోల్డ్‌వార్ సమయంలో ఇదే విషయం సోవియట్‌ను భయపెట్టింది. దీంతో దేశ అత్యున్నత నాయకత్వం, నూక్లియర్ కమాండ్ అణుదాడిలో తుడిచిపెట్టుకుపోయినా.. ప్రత్యర్థులపై అణ్వాస్త్రాలను సంధించేందుకు 'పెరిమీటర్' పేరిట ఒక వ్యవస్థను సోవియట్ సిద్ధం చేసింది. దీనిని అమెరికా, పశ్చిమ దేశాల్లో ‘డెడ్‌హ్యాండ్’గా వ్యవహరిస్తారు. అణుదాడిలో రష్యా బాగా దెబ్బతిన్నా.. ఈ డెడ్‌హ్యాండ్ వ్యవస్థ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తుంది.
ఏమిటీ డెడ్‌హ్యాండ్..?
సోవియట్ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనతో దీని రూపుకల్పన చేశారు. అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను దీని వార్‌హెడ్‌లో అమర్చారు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భ బొరియలు (సిలోస్), ఇతర చోట్ల భద్రపర్చిన అణు క్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకొంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
అణుదాడి జరిగే అవకాశం ఉన్న సమయంలో అత్యున్నత స్థాయి అధికారులు డెడ్‌హ్యాండ్‌ను యాక్టివేట్ చేస్తారు. అప్పుడు ఈ వ్యవస్థ సెస్మిక్ , రేడియేషన్, గాలి ఒత్తిడి వంటి వాటిని సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. అణుదాడి జరిగినట్లు నిర్ధారించుకొన్నాక.. వార్ రూమ్‌తో కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వేచి చూసిన తర్వాత అణుదాడికి ఆదేశాలు జారీ చేసేవారి వైపు నుంచి స్పందన లేకపోతే.. వారు మృతి చెందినట్లు భావించి పెరిమీటరే అణుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది.