Russia ukraine war: మహా రష్యాను నిర్మించాలనే సంకల్పంతో రెండు దశాబ్దాలకు పైగా ఆ దేశ రాజకీయాలను శాసిస్తున్న వ్లాదిమిర్ పుతిన్(69) అంతరంగం గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. శత్రువులను ఎల్లప్పుడూ గందరగోళ పరిస్థితుల్లోనే ఉంచాలనే సూత్రాన్ని గట్టిగా విశ్వసించే, ఆచరించే వ్యక్తుల్లో ఆయన ఒకరనే అభిప్రాయం ఉంది. సిద్ధాంతాలకు, విశ్వాసాలకు అంతగా కట్టుబడే వ్యక్తి కాదని, తాను అనుకున్నదే జరగాలనే వ్యక్తిత్వం ప్రస్తుత రష్యా అధ్యక్షుడి సొంతమని విశ్లేషకులు అంచనాలు వేస్తుంటారు. మరి పుతిన్ ఆలోచనలు అమలు చేసేది ఎవరు? సలహాలు, సూచనల కోసం ఆయన ఎవరి మీద ఆధారపడుతుంటారు? నియంతృత్వ పోకడలు అధికమనే ఆరోపణలున్న నేతకు సన్నిహితులు ఎవరు? ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ ఎవరి మీద ఆధారపడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సలహాలిచ్చేందుకు 30 మంది సభ్యులతో కూడిన భద్రత మండలి(సెక్యూరిటీ కౌన్సిల్) ఉంది. అయితే, భద్రత మండలి సభ్యుల్లోనూ ఏడెనిమిది మందిని మాత్రమే అత్యంత నమ్మకస్తులుగా పుతిన్ పరిగణిస్తుంటారని సమాచారం. వీరిలోనూ సోవియట్ యూనియన్ నాటి గూఢచారి సంస్థ కేజీబీలో పుతిన్‌తో కలిసి పనిచేసిన వాళ్లే ఆయనకు కళ్లు, చెవులు.
సెర్గీ షొయిగు (రక్షణ మంత్రి)
ఎవరినీ అంత తేలిగ్గా విశ్వసించని పుతిన్‌కు సుదీర్ఘకాలం నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సెర్గి షొయిగునే(66).. రష్యా ప్రస్తుత రక్షణ మంత్రి. ఉక్రెయిన్ వ్యవహారంలో పుతిన్‌కు నోటిలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను ముందుకు నెట్టి తమ దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్న రష్యా అధ్యక్షుడి వాదనలను గట్టిగా సమర్థించే వ్యక్తి. పుతిన్ తర్వాత దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టదగిన అర్హతలున్న వ్యక్తిగా గతంలో షొయిగు పేరు వినిపించింది. అధ్యక్షుడి విహార యాత్రలో పుతిన్ వెంట సైబీరియాకు వెళ్లి చేపల వేట, తదితరాల్లో పాల్గొనేంత చొరవ ఉన్న వ్యక్తి. 2014లో క్రిమియాను రష్యా హస్తగతం చేసుకున్న వ్యవహారంలో ఆ క్రెడిట్ అంతా సెర్గీ షొయిగుకే దక్కింది. సైనిక నిఘా సంస్థ అధినేతగానూ వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విష ప్రయోగం జరిగిన ఘటనలు రెండింరటిలో ఇతనిపై ఆరోపణలున్నాయి. రష్యాకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న పుతిన్ భావజాలాన్ని గట్టిగా సమర్థించడంతో పాటు అందుకోసం కృషి చేస్తున్న వారిలో షొయిగు ప్రముఖుడు.
విక్టర్ జొలొటోవ్ (నేషనల్ గార్డ్ డైరెక్టర్)
అధ్యక్షుడు పుతిన్‌కు గతంలో అంగరక్షకుడిగా పనిచేసిన విక్టర్ జొలొటోవ్ ప్రస్తుతం రష్యా నేషనల్ గార్డ్..రోజ్‌గ్వార్డియా అధినేత. ఆరేళ్ల క్రితమే పుతిన్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒకరకంగా ఇది వ్యక్తిగత ప్రైవేటు సైన్యం. నాలుగు లక్షల మందితో కూడిన వ్యక్తిగత భద్రత విభాగానికి అధినేతగా నియమితులయ్యారంటే విక్టర్‌పై పుతిన్‌కు ఎంత గురి ఉందో తెలుసుకోవచ్చు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఆశించినంత వేగంగా కొనసాగకపోవడంతో నేషనల్ గార్డ్‌ను పుతిన్ రంగంలోకి దించారని సమాచారం. అయితే, ఈ విభాగ అధిపతికి సైనిక శిక్షణ లేకపోవడం, ఈ దళాలకు యుద్ధ ట్యాంకులు లేకపోవడం వల్ల రణ రంగంలో అంతగా ప్రభావం చూపలేక పోతున్నారని తెలుస్తోంది.
వలెరి గెరసిమోవ్ (చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, రష్యన్ ఆర్మీ)
పూర్వపు రష్యాను ఏకతాటిపైకి తీసుకురావాలని దృఢంగా ఆకాంక్షించే వ్యక్తి వలెరి గెరసిమోవ్(66). 1999లో చెచెన్ యుద్ధ సమయంలో సైనిక కమాండర్‌గా వ్యవహరించిన గెరసిమోవ్ ఆ తర్వాత కాలంలో పుతిన్ సైనిక వ్యూహాల రచనలో కీలకపాత్రధారిగా మారారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంలోను, గత నెల బెలారస్‌లో రష్యా సైనికుల విన్యాసాల నిర్వహణ వెనుక సూత్రధారి ఈ సైనికాధికారే. క్రిమియాను రష్యాలో విలీనం చేయడంలో ముఖ్య భూమికను నిర్వహించారు. అయితే, ప్రస్తుతం ఉక్రెయిన్‌పై పోరులో రష్యా సైనికుల్లో నైతిక స్థైర్యం లోపించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గెరసిమోవ్‌పై అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహంతో ఉన్నారని సమాచారం.
నికోలై పత్రుషెవ్ (రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి)
దుడుకు స్వభావం గల వ్యక్తి. యుద్ధ పిపాసి. రష్యాకు కష్టాలు తెచ్చిపెట్టే వ్యక్తిగా నికోలై పత్రుషెవ్(70) గురించి పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తుంటాయి. అయిదు దశాబ్దాలుగా పుతిన్‌కు వీర విధేయులైన ముగ్గురు వ్యక్తుల్లో నికోలై ఒకరు. మిగిలిన ఇద్దరు...సెక్యూరిటీ సర్వీస్ అధినేత అలెగ్జాండర్ బొర్తినికోవ్, విదేశీ నిఘా సంస్థ అధిపతి సెర్గీ నర్యషికిన్. పుతిన్ ఆంతరంగికులను సిలోవికిగా వ్యవహరిస్తుంటారు. వారందరిలోకి ఈ ముగ్గురు పుతిన్‌కు అత్యంత సన్నిహితులు. సోవియట్ యూనియన్ నాటి నిఘా సంస్థ కేజీబీ ఆ తర్వాత కాలంలో ఎఫ్‌ఎస్‌బీగా రూపాంతరం చెందింది. ఈ కొత్త సంస్థకు 1999 నుంచి 2008 వరకు నికోలై నేతృత్వం వహించారు. రష్యా విచ్ఛిన్నానికి అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఉక్రెయిన్‌ను దారిలోకి తెచ్చుకోవడం ద్వారా దానిని అడ్డుకోవాలని బలంగా వాదిస్తున్న వ్యక్తి నికోలై. అందులో భాగంగానే ఉక్రెయిన్‌ఫై ప్రస్తుత యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ప్రాబల్య ప్రాంతాలు...దొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పట్టుబట్టిన వ్యక్తి నికోలై పత్రుషెవ్.