తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా దాడిలో 1300 మంది ఉక్రేనియన్లు మృతి: జెలెన్‌స్కీ

russia ukraine
రష్యా ఉక్రెయిన్

By

Published : Mar 12, 2022, 8:03 AM IST

Updated : Mar 12, 2022, 10:34 PM IST

22:33 March 12

రష్యా దాడిలో 1300 మంది ఉక్రేనియన్లు మృతి: జెలెన్‌స్కీ

రష్యా దండయాత్రలో ఫిబ్రవరి 24 నుంచి 1300 మందికి పైగా తమ దేశస్థులు మృతిచెందినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ చర్చలు జరపగా.. కొద్ది గంటల తర్వాత వారిద్దరితోనూ జెలెన్‌స్కీ మాట్లాడారు. శాంతి చర్చలకు అవకాశాలపై వారితో చర్చించినట్టు తెలిపారు. అందరం కలిసి దురాక్రమణదారుల్ని అడ్డుకోవాలని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

13:32 March 12

ఎయిర్​ రైడ్​ సైరన్లు..

ఉక్రెయిన్​లోని కీవ్​ సహా పలు చోట్ల ఎయిర్​ రైడ్​ సైరన్లు వినిపించాయి. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.

కీవ్​ ఒబ్లాస్ట్​ సహా పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. వసిల్కివ్​లోని ఆయిల్​ డిపో ప్రమాదానికి గురైంది. క్విట్నివే ప్రాంతంలో.. గిడ్డంగిలో నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తులు రష్యా దాడులతో చెల్లాచెదురయ్యాయి.

09:33 March 12

యూట్యూబ్​ ఆంక్షలు

యూట్యూబ్​లోని రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానెళ్లను బ్లాక్​ చేస్తున్నట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు తెలిపింది.

09:24 March 12

రష్యా, బెలారస్​లకు ఎగుమతులపై ఆంక్షలు

రష్యాను కట్టడి చేసేందుకు వరుస ఆంక్షలను విధిస్తున్న అమెరికా మరో కీలక ప్రకటన చేసింది. రష్యా సహా ఆ దేశానికి సహకరిస్తున్న బెలారస్​లకు లగ్జరీ వస్తువులను ఎగుమతులు చేయడంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధి నెడ్​ ప్రిన్స్​ వెల్లడించారు.

ఇప్పటికే ఐరోపా సమాఖ్య కూడా లగ్జరీ వస్తువులపై నిషేధం విధించింది.

09:24 March 12

ఇన్​స్టాగ్రామ్​ బ్లాక్​

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఇన్​స్టాగ్రామ్​పై రష్యా నిషేధం విధించడాన్ని ఆ సంస్థ చీఫ్​ ఆడమ్​ ముస్సేరీ తప్పుపట్టారు. రష్యా చర్య సరికాదని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

09:23 March 12

మెలిటొపోల్​ మేయర్​ కిడ్నాప్​

మెలిటొపోల్​ నగరానికి చెందిన మేయర్​ను రష్యా బలగాలు అపహరించినట్లు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ ఆరోపించారు. రష్యన్​ సేనల వైఖరి ఐసిస్​ తీవ్రవాదుల చర్యలను పోలి ఉందని వ్యాఖ్యానించారు.

మేయర్​ ఇవాన్​ ఫెదొరోవ్​ను రష్యన్​ బలగాలు తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధికారి సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.

రష్యన్లు మేయర్​ను అపహరించి యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ పేర్కొంది.

08:35 March 12

3 విమానాల్లో స్వదేశానికి

యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు దాదాపు కొలిక్కి వచ్చింది. శుక్రవారం మూడు విమానాల్లో 674 మంది విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. సుమీ నగరంలో చిక్కుకుపోయిన వీరందరినీ క్షేమంగా తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంపై వారందరూ హర్షం వ్యక్తం చేశారు. తొలుత రెండు విమానాల్లో(ఎయిర్​ ఇండియా, ఇండిగో) 461 మంది విద్యార్థులు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

భారత వాయుసేనకు చెందిన ఐఏఎఫ్‌ సి-17 విమానం 213 మందితో హిందాన్‌ ఎయిర్‌ బేస్‌లో దిగింది. విమానాశ్రయాల వెలుపలకు వచ్చి తమ తల్లిదండ్రులను, బంధుమిత్రులను కలుసుకోగానే విద్యార్థులందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. కొందరు తల్లిదండ్రులు మిఠాయిలు పంచగా, మరికొందరు పూలమాలలతో తమ బిడ్డలకు స్వాగతం పలికారు. భారత్‌ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి. 'ప్రాణాలతో భారత్‌కు తిరిగి వస్తానని అనుకోలేదు. సుమీలోని బంకర్లలో నరకం అనుభవించాం. తాగేందుకు నీరు లేదు. తినేందుకు తిండి లేదు. నీటి కోసం మంచు కరిగించుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి బయటపడడానికి రెండు వారాలు పట్టింది' అని విద్యార్థులు ధ్రువ్‌ పండిత, విరాధ లక్ష్మి తదితరులు వివరించారు.

07:26 March 12

Russia- Ukraine War Live Updates

ఒత్తిడి పెరుగుతున్నా తగ్గని రష్యా

ఉక్రెయిన్​పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాత్కాలిక విరామాలు ప్రకటిస్తూనే అంతకంటే భీకర దాడులతో విరుచుకుపడుతోంది. కీలక నగరాలపై బాంబు దాడులు చేపడుతున్న రష్యా.. సైనిక, వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా మరింత ఒత్తిడిని పెంచింది. రష్యా నుంచి పలు వస్తువుల దిగుమతిని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Last Updated : Mar 12, 2022, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details