డాన్‌బాస్‌ను కాపాడేందుకు ప్రత్యేక సైనిక చర్య గురించి ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.
డాన్బాస్ రక్షణకు ఇజ్రాయెల్ ప్రధానితో పుతిన్ చర్చలు - ఉక్రెయిన్ సంక్షోభం
01:33 March 03
23:37 March 02
మరో రెండు రోజుల్లో మొత్తం 3500 మంది విద్యార్థులు బుచారెస్ట్ నుంచి 1300 మంది సుసెవా నుంచి తరలించనున్నట్లు తెలిపారు. పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. గురువారం తాను.. సైరెట్ సరిహద్దులకు వెళ్లి.. భారతీయులను తరలించేంతవరకు అక్కడే ఉండనున్నట్లు సింధియా చెప్పారు.
22:22 March 02
భారతీయుల తరలింపుపై పుతిన్‌తో మోదీ ఫోన్ సంభాషణ
ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఖార్కివ్‌లో చాలా మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన పరిస్థితిపై పుతిన్‌తో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై పుతిన్‌తో మోదీ మాట్లాడినట్లు చెప్పింది.
22:12 March 02
భారత విద్యార్థి మృతిపై ఉక్రెయిన్ విచారం
ఖార్కివ్‌లో భారత విద్యార్థి మృతి పట్ల ఉక్రెయిన్ విచారం వ్యక్తం చేసింది. ఐరాసలో ఆ దేశ రాయబారి సెర్గీ నవీన్ మృతిపై స్పందించారు. రష్యా సాయుధ బలగాల దాడిలో మృతి చెందిన నవీన్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.
20:11 March 02
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. 8.30 గంటలకు ఈ భేటీ జరగనుంది.
20:03 March 02
వాయుసేన విమానాల్లో భారత్‌కు 800 మంది పౌరులు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం బయల్దేరిన నాలుగు వైమానిక దళాలు.. ఈ అర్ధరాత్రి, రేపు ఉదయం దిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్నాయి. సుమారు 800 మంది భారతీయులు ఈ విమానాల్లో భారత్‌కు తిరిగి రానున్నారు.
ఉక్రెయిన్‌కి మానవతా సాయం కింద మందులు, వైద్య పరికరాలు, ఆహారం, నీళ్లు, టెంట్లు, నీటి నిల్వ ట్యాంకులు, దుప్పట్లు, సోలార్ లాంపులతో ఉదయం దిల్లీ నుంచి వాయు సేన విమానాలు బయల్దేరాయి. ఆ విమానాల్లోనే భారత పౌరులు స్వదేశానికి రానున్నారు.
19:03 March 02
'కాలినడకన అయినా సరే ఖార్కివ్‌ను వదిలి బయటకు రావాల్సిందే'
ఉక్రెయిన్ నుంచి భారతీయలు తరలింపుపై విదేశాంగశాఖ అడ్వయిజరీ జారీ చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రష్యన్ సలహా మేరకు ఖార్కివ్‌ను భారతీయులు ఖాళీ చేయాలని పేర్కొంది. కాలినడకన అయినా సరే ఖార్కివ్‌ను వదిలి బయటకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. రష్యన్ ఇన్‌పుట్‌పైనే ఖార్కివ్ నుంచి బయటకు రావాలని అడ్వయిజరీలో వివరించింది.
ఇప్పటి వరకు 17,000 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి బయటికి వచ్చినట్లు విదేశాంగశాఖ చెప్పింది. మొత్తం 15 విమానాల్లో 3,353 మంది భారతీయులు దేశానికి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. 24 గంటల్లో మరో 15 విమానాలు ద్వారా తరలింపును చేపట్టనున్నట్లు, ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు వివరించింది.
18:42 March 02
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- 2వేల మంది మృతి
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇప్పటి వరకు 2,000 మంది పౌరులు చనిపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.
17:19 March 02
ఖర్కివ్ నగరాన్ని తక్షణమే వీడండి: భారతీయులకు హెచ్చరిక
ఉక్రెయిన్ నగరాలపై రష్యా సేనల భీకరదాడులు కొనసాగుతున్న వేళ అక్కడి భారత రాయబార కార్యాలయం భారత పౌరుల భద్రత దృష్ట్యా అత్యవసర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఖార్కివ్ నగరాన్ని తక్షణమే వీడాలని సూచించింది. పెసోచిన్, బాబే, బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవాలని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
నలుగురు మృతి
ఖార్కివ్‌పై రష్యా దాడుల్లో నలుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
16:34 March 02
పోలండ్ అధ్యక్షుడికి మోదీ థాంక్స్
దిల్లీ: పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారతీయుల తరలింపు విషయంలో చేస్తున్న సాయాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్ నుంచి పోలండ్‌లోకి భారత పౌరులు ప్రవేశించేందుకు వీసా నిబంధనల్ని సడలించినందుకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2001లో గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు పోలండ్ సాయం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అలాగే, భారత పౌరుల తరలింపు కోసం కేంద్రమంత్రి వీకే సింగ్ పోలండ్‌కు వచ్చిన విషయాన్ని డుడాకు మోదీ తెలిపినట్టు పోలండ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
16:26 March 02
ఉక్రెయిన్ నుంచి 8.36 లక్షల మంది వలస: ఐరాస
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఐరాస కీలక ప్రకటన విడుదల చేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి భారీగా వలసలు పెరిగినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 8.36 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి వెల్లినట్లు వెల్లడించింది.
15:52 March 02
మూడో ప్రపంచ యుద్ధం వస్తే విధ్వంసమే: రష్యా
మూడో ప్రపంచ యుద్ధంపై రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. విధ్వంసకరంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆ యుద్ధం అణ్వాయుధాలతోనే చేయాల్సి ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అణ్వాస్త్రాల సేకరణకు రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదన్నారు. ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
15:45 March 02
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతిపై స్పందించిన రష్యా
ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్లో భారత వైద్య విద్యార్థి నవీన్ మృతిపై రష్యా స్పందించింది. విద్యార్థి మృతిపై విచారణ చేపడుతామని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ తెలిపారు.
13:14 March 02
రష్యన్ల అధీనంలో ఖెర్సన్
ఉక్రెయిన్‌లోని మరో ప్రధాన నగరం ఖెర్సన్‌ను రష్యన్లు చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు అక్కడి గవర్నర్. ఈ మేరకు రాయిటర్స్ వెల్లడించింది.
13:11 March 02
6 వేల మంది రష్యన్ సైనికుల్ని చంపాం: జెలెన్స్కీ
యుద్ధం సందర్భంగా 6 రోజుల్లో 6 వేల మంది రష్యన్ సైనికుల్ని చంపినట్లు తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ మేరకు రాయిటర్స్ ఉటంకించింది.
12:52 March 02
స్వదేశానికి 6 వేల మంది..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20 వేల మందికిపైగా భారతీయుల్లో ఇప్పటివరకు 6 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి వీ. మురళీధరన్ వెల్లడించారు. ఫిబ్రవరి 24కు ముందే 4000 మంది వచ్చారని.. ఆ తర్వాత ఇప్పటివరకు మరో 2 వేల మందిని తీసుకొచ్చామని తెలిపారు.
12:34 March 02
31 విమానాలు.. 6,300 మందికిపైగా తరలింపు..
ఉక్రెయిన్ సహా అక్కడి సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయుల తరలింపును వేగవంతం చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో మొత్తం 31 విమానాల ద్వారా.. 6300 మందికిపైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి.
'ఆపరేషన్ గంగ'లో భాగంగా.. కేంద్రం ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, స్పైస్‌జెట్‌తో పాటు భారత వాయుసేన ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా తరలింపు ప్రక్రియలో భాగమయ్యాయి.
ఇందులో 21 ఫ్లైట్లు రొమేనియాలోని బుకారెస్ట్, 4 హంగేరీలోని బుడాపెస్ట్, మరో నాలుగు పోలండ్‌లోని రెస్జో నుంచి, ఒకటి స్లొవేకియా నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు షెడ్యూల్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
12:31 March 02
భారత్‌కు చేరిన మరో విమానం..
బుకారెస్ట్ నుంచి భారతీయులతో బయల్దేరిన మరో విమానం దిల్లీకి చేరుకుంది. వారికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ స్వాగతం పలికారు.
12:05 March 02
ఖర్కివ్‌లో భారీ పేలుళ్లు..
ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులను ముమ్మరం చేశాయి. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. బుధవారం ఉదయం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
11:43 March 02
రష్యా మీదుగా భారత్‌కు విమానాలను నిలిపేసిన అమెరికా!
అమెరికా నుంచి భారత్‌లోని ముంబయి, దిల్లీకి చేరేందుకు రష్యా గగనతలాన్ని వినియోగించటాన్ని నిలిపివేసినట్లు అగ్రరాజ్యానికి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని విమానయాన సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే, పూర్తి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు.. దిల్లీ, న్యూయార్క్ మధ్య తిరిగే విమానాలకు రష్యా గగనతలాన్ని వినియోగించటాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన చేశాయి విమానయాన సంస్థలు.
10:36 March 02
ఖర్కివ్ నగరంలో ప్రవేశించిన రష్యా దళాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరో ప్రధాన నగరం ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు భీకర దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. ఈ క్రమంలో ఖర్కివ్ నగరంలో రష్యాకు చెందిన బలగాలు దిగినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఆకాశ మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు తెలిపిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
09:49 March 02
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 3 వాయుసేన విమానాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగాలో భాగంగా.. వాయుసేనకు చెందిన మరో మూడు రవాణా విమానాలు పోలండ్, హంగెరీ, రొమేనియాకు బుధవారం వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సీ-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు పలు సామగ్రితో బయలుదేరి వెళ్లింది.
వాయుసేన విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల వంటి ఇతర సామగ్రిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు విమానాలు హిందోన్ ఎయిర్‌బేస్ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
09:21 March 02
దిల్లీ చేరిన మరో 220 మంది భారత పౌరులు
ఉక్రెయిన్ నుంచి మరో 220 మంది దిల్లీ చేరుకున్నారు. ఇస్తాంబుల్ మీదుగా దిల్లీ చేరుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ' నేను ఓ అమ్మాయిని ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడగగా.. నేను భారతీయురాలిని అని సమాధానమిచ్చింది. ఒత్తిడి కారణంగా భారత్‌కు చేరుకున్నామని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చాం.' అని పేర్కొన్నారు. దిల్లీ చేరుకున్న విద్యార్థులతో జితేంద్ర సింగ్ మాట్లాడుతుండగా.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగింది.
08:25 March 02
ఉక్రెయిన్ సంక్షోభంపై ఈ నెల 7, 8న ఐసీజేలో విచారణ
రష్యా- ఉక్రెయిన్ సంక్షోభంపై ఈ నెల 7,8వ తేదీల్లో విచారణ చేపట్టనుంది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిపింది.
తమ దేశంపై రష్యా మారణహోమానికి పాల్పడిందంటూ ఐసీజే తలుపు తట్టింది ఉక్రెయిన్. దాడులకు రష్యాను బాధ్యులు చేయాలని కోరింది. వారం రోజుల్లోనే విచారణ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
07:57 March 02
పుతిన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. యుద్ధ రంగంలో పుతిన్ లాభపడొచ్చు కానీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలతోనే అమెరికా ఉందని ఉద్ఘాటించారు. స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్ అంశంపై మాట్లాడారు బైడెన్
07:38 March 02
సాయుధ కాన్వాయ్ శాటిలైట్ చిత్రాలు..
ఉక్రెయిన్ వైపు వేగంగా దూసుకెళ్తున్న రష్యా సాయుధ కాన్వాయ్ శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. 40 మైళ్ల పొడవున విస్తరించిన సైనిక వాహన శ్రేణి సంబంధిత వీడియోను రాయిటర్స్ పోస్ట్ చేసింది.
07:35 March 02
రష్యాలో యాపిల్ బంద్..
రష్యాలో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది యాపిల్ సంస్థ. ఈ మేరకు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
07:33 March 02
ఒక్కరోజే ఉక్రెయిన్ నుంచి 1377 మంది స్వదేశానికి.. కీవ్‌లో భారతీయులెవరూ లేరు
కల్లోలిత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. నిన్న ఒక్కరోజే 1300 మందికి పైగా పౌరులను స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రస్తుతం భారత పౌరులెవరూ లేరని స్పష్టం చేసింది.
"ఆపరేషన్ గంగ కార్యక్రమంలో కింద గడిచిన 24 గంటల్లో ఆరు విమానాలు భారత్‌కు బయల్దేరాయి. నిన్న ఒక్క రోజే 1377 మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించాం" అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నేడు ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను భారత పౌరులందరూ వీడినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 26 విమానాల ద్వారా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి చెందిన విమానాలను రంగంలోకి దింపింది. ఈ తెల్లవారుజామున 4 గంటలకు వాయుదళానికి చెందిన సీ-17 విమానం దిల్లీ నుంచి రొమేనియా బయల్దేరింది. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యల కోసం అవసరమైన సామగ్రిని ఇందులో పంపించారు. తిరుగు ప్రయాణంలో భారత విద్యార్థులను తీసుకురానున్నారు. ఐఏఎఫ్‌కు చెందిన అతిపెద్ద రవాణా విమానాలైన ఇవి ఒక్కొక్కటి సుమారు 300 మందిని తరలించగలవు.
06:51 March 02
రష్యాపై కొనసాగుతున్న ఆంక్షలు.. గగనతలం మూసేసిన అమెరికా
ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు పలు ఆంక్షలు విధించిన అమెరికా.. తాజాగా రష్యా విమానాలపై నిషేధం విధించింది. తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. మరోవైపు.. తమ పోర్టుల్లో రష్యా నౌకలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది ఐరోపా సమాఖ్య
ప్రపంచ బ్యాంకు సాయం..
రష్యా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు భారీ సాయం అందించేందుకు సిద్ధమైంది ప్రపంచ బ్యాంకు. అత్యవసర సాయం కింద 3 బిలియన్ డాలర్లు అందించనున్నట్లు ప్రకటించింది.
06:48 March 02
రొమేనియాలో భారత విద్యార్థులతో జోతిరాదిత్య సింధియా
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను తరలించే ప్రక్రియలో భాగంగా రొమేనియాకు వెళ్లారు పౌరు విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా. బుచారెస్ట్ చేరుకున్న తర్వాత.. విమానాశ్రయంలోనే ఆ దేశ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. త్వరితగతిన తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భరోసా కల్పించారు. "భారతీయులను అనుమతిస్తూ మాల్డోవా సరిహద్దులు తెరిచారు. అక్కడ వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మాల్డోవా నుంచి బుచారెస్ట్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం." అని ట్వీట్ చేశారు మంత్రి. అనంతరం రొమేనియా, మాల్డోవాకు భారత రాయబారి రాహుల్ శ్రీవాస్తవాతో భేటీ అయ్యారు సింధియా. తరలింపు ప్రక్రియలో ఎదురవుతోన్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
06:25 March 02
LIVE Russia Ukraine war: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం లైవ్ అప్డేట్స్
రొమేనియాకు వెళ్లిన సీ-17 విమానం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 రవాణా విమానం రొమేనియాకు వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్, గాజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్‌బేస్ నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన.. కొద్దిసేపటికే ఆపరేషన్ గంగలో వాయుసేన భాగమవుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు.