తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిపా ప్రపంచ కప్​ 2022 నుంచి రష్యా బహిష్కరణ

Russia attack Ukraine
ఉక్రెయిన్​ రష్యా యుద్ధం

By

Published : Feb 28, 2022, 6:48 AM IST

Updated : Mar 1, 2022, 1:27 AM IST

01:24 March 01

ఫిపా ప్రపంచ కప్​ 2022 నుంచి రష్యా బహిష్కరణ

ఉక్రెయిన్​ పై సైనిక చర్య నేపథ్యంలో ఇప్పటికే అమెరికాతో సహా పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్​బాల్​ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్​తో పాటు అన్నీ అంతర్జాతీయ పోటీలు, లీగ్​ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిపా, యూఈఎఫ్​ఏ సంయుక్త సమావేశంలో ప్రకటించాయి. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపాయి. ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్​లో పాల్గొనేందుకు రష్యా పురుషుల జట్టు క్వాలిఫైయింగ్​ ఫ్లే ఆఫ్​ సెమీఫైనల్​లో పోలాండ్​ తో మార్చి 24న తలపడనుంది. సెమీస్​ గెలిస్తే స్వీడన్​ లేదా చెక్​ రిపబ్లిక్​తో తలపడాల్సి వస్తుంది. అయితే ఈ మూడు జట్లు రష్యాతో ఆడడానికి నిరాకరించాయి. రష్యాను బహిష్కరించాలని పట్టుబట్టాయి. ఉక్రెయిన్​ ప్రజల కోసం సంఘీభావంగా ఫుట్​బాల్​ ప్రపంచం ఐక్యంగా ఉందని ఫీఫా, యూఈఎఫ్​ఏ తెలిపాయి. ఉక్రెయిన్​లో పరిస్థితులు వేగంగా మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని, ఫుట్​బాల్​ క్రీడ ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొలుపుతుందని ఆశిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్​ఏ అధ్యక్షులు జియాని ఇన్​ఫాంటినో, అలెగ్జాండర్​ సెఫెరిన్​ తెలిపారు.

22:14 February 28

ఉక్రెయిన్​-రష్యా మధ్య రెండో దఫా చర్చలు.. వేదిక నిర్ణయం

ఉక్రెయిన్​- రష్యా మధ్య తొలి దఫా చర్చలు బెలారస్​ సరిహద్దుల్లో సుమారు 4 గంటల పాటు సాగాయి. ఇరు దేశాలు తమ డిమాండ్లను వినిపించాయి. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమైనట్లు మీడియా వెల్లడించింది. పోలిష్​-బెలరస్​ సరిహద్దు ప్రాంతంలో రెండో దశ చర్చలు జరగనున్నాయని.. రష్యా ప్రతినిధుల బృందం అధినేత తెలిపినట్లు పేర్కొంది.

21:59 February 28

'యుద్ధం ముగించాలనే అనుకుంటున్నాం'

ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని ఐరాసలో రష్యా రాయబారి పేర్కొన్నారు. ఉక్రెయిన్, జార్జియాలను నాటోలో చేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయని అన్నారు. రష్యా వ్యతిరేక ఉక్రెయిన్​ను తయారు చేసేందుకు కొందరు ప్రయత్నించారని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఉక్రెయిన్ నాటోలో చేరడం అనేది రెడ్ లైన్. అదే ఈ సంఘర్షణకు దారితీసింది. ప్రతిస్పందన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని రష్యా ప్రారంభించలేదు. మేం ఈ యుద్ధాన్ని ముగించాలనే కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.

21:38 February 28

నగదు ట్రాన్స్​ఫర్లపై నిషేధం

దేశంలోని ప్రజలెవరూ విదేశాలకు నగదు ట్రాన్స్​ఫర్ చేయకుండా నిషేధం విధించింది రష్యా. స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడం, రూబుల్ మారకం విలువ పతనమవడం వంటి పరిణామాల నేపేథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, ఐరోపా సమాఖ్యలో తమను చేర్చుకోవాలంటూ ఓ దరఖాస్తుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ సంతకం చేశారు.

20:47 February 28

రష్యా అణ్వాయుధ ప్రకటనపై ఐరాస ఆందోళన

ఉక్రెయిన్​పై జరుపుతున్న దాడులను వెంటనే ఆపాలని కోరారు ఐక్యరాజ్య సమితి చీఫ్​ ఆంటోనియో గుటెరస్​. ఉక్రెయిన్​ అంశంపై అత్యవసర సమావేశంలో మాట్లాడారు. రష్యా సైనికులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. రష్యా అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేయటం ఉత్కంఠ కలిగించే అంశమన్నారు. అణ్వాయుధాలను వినియోగించాలన్న ఆలోచన ఊహించలేనిదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

ఉక్రెయిన్​పై ఐరాస అత్యవసర సమావేశం

ఉక్రెయిన్​పై రష్యా సైనిక దాడిని కొనసాగిస్తున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి 11వ అత్యవసర ప్రత్యేక సర్వసభ సమావేశం ప్రారంభమైంది. రష్యా దాడులు, ఉక్రెయిన్​లో తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశం సభ్య దేశాలు చర్చించనున్నాయి.

20:20 February 28

మరోసారి భేటీ

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మరోసారి ఉన్నతస్థాయి భేటీ జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపుపై భేటీలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందించడంపై చర్చ జరిగిందని చెప్పారు.

20:01 February 28

ముగిసిన చర్చలు

ఉక్రెయిన్‌- రష్యా మధ్య చర్చలు ముగిశాయి. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సుమారు 4 గంటలపాటు చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేసింది. గతంలో ఆక్రమించుకున్న క్రిమియా, డాన్​బాస్​ల నుంచి రష్యా సైన్యం వైదొలగాలని స్పష్టం చేసింది.

మరోవైపు, తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా వాదించింది.

ఆంక్షలు..

అటు.. 36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు విధించింది. తమ గగనతలంలోకి రాకుండా బ్రిటన్‌, జర్మనీ సహా 36 దేశాల విమానాలపై నిషేధం విధించింది.

15:55 February 28

చర్చలు షురూ...

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్​లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నాయి.

తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

15:31 February 28

102 మంది మృతి: ఐరాస

రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో 102 మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారని తెలిపింది.

వలస సంక్షోభం

మరోవైపు, ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖ పేర్కొన్నారు. ఇప్పటికే 4 లక్షల మంది ఉక్రెయిన్​ను విడిచిపెట్టి వెళ్లారని చెప్పారు.

'రష్యా దాడులతో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికే 4 లక్షల మంది ఉక్రెయిన్‌ వీడి వెళ్లారు. యుద్ధం ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉంది. లక్షలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు సరిహద్దుల్లో ఉన్నారు. వలస వెళ్లేందుకు వీరంతా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులను తరలించడమే భారత్‌ ప్రాధాన్యత. యుద్ధాన్ని నిలువరించడమే మా ప్రాధాన్యం. రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలి' అని వివరించారు.

15:17 February 28

ఉక్రెయిన్​కు నాటో దేశాల సాయం

రష్యా సేనలను ప్రతిఘటిస్తూ వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు నాటో సభ్య దేశాలు ముందుకొస్తున్నాయి. గగనతల రక్షణ క్షిపణులు, ట్యాంకు విధ్వంసక ఆయుధాలను అందించాలని సభ్య దేశాలు నిర్ణయించాయని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ తెలిపారు. ఆర్థిక, మానవతా సహాయాన్ని సైతం అందించనున్నట్లు చెప్పారు.

14:07 February 28

రష్యా-ఉక్రెయిన్​ మధ్య ఎట్టకేలకు కీలక చర్చలు జరగనున్నాయి. రష్యా ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు ఉక్రెయిన్​ బృందం బెలారస్ సరిహద్దుకు చేరుకుంది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. తక్షణమే కాల్పుల విరమణ, రష్యా దళాల ఉపసంహరణే ఈ చర్చల లక్ష్యమని స్పష్టం చేసింది.

11:49 February 28

రష్యాపై పోరాటానికి ఉక్రెయిన్​లో ఖైదీల విడుదల

దూసుకొస్తోన్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులను విడుదల చేస్తోంది. దాంతో వారు దేశం తరఫున రష్యాపై పోరాటంలో చేరనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్‌ కార్యాలయం ధ్రువీకరించింది.

10:55 February 28

కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాతిథ్య సింథియా, కిరణ్ రిజిజు, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్​ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకరించనున్నారు.

10:43 February 28

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్​ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొందమంది కేంద్ర మంత్రులు ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

10:31 February 28

ఉక్రెయిన్​తో యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతుగా బెలారస్.. తన సైన్యాన్ని ఉక్రెయిన్ పంపే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్​తో రష్యా బలగాలతోపాటు బెలారస్ సైన్యం పోరాడవచ్చని అన్నారు.

ఉక్రెయిన్​పై రష్యా దాడిని బెలారస్ మద్దతిస్తూ వస్తోంది. కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉక్రెయిన్​తో పోరాడలేదు. మరోవైపు రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం వీరోచితపోరాటం చేస్తోంది.

09:38 February 28

ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని రేడియో యాక్టివ్ వేస్ట్ ఫెసిలిటీ సెంటర్​పై రష్యా క్షిపణులు దాడి చేశాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఉక్రెయిన్ తెలిపింది. అయితే అణుశక్తి కేంద్రానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ అణుశక్తి కేంద్రంలోని రెండు సెంటర్లను వెంటనే పునరుద్ధరించామని ది స్టేట్ న్యూక్లియర్ రియాక్టర్ రెగ్యులేటరీ విభాగం(ఎస్​ఎన్​ఆర్​ఐయూ) తెలిపింది.

రష్యా జరిపిన దాడిలో అణుశక్తి కేంద్రానికి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ ట్రాన్స్​ఫార్మర్ కూడా ధ్వంసం అయినట్లు ఎస్​ఎన్​ఆర్​ఐయూ తెలిపింది.

08:22 February 28

రష్యా దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ధ్వంసం

రష్యా వైమానిక దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం 'ఏఎన్‌-225 మ్రియా' ధ్వంసమైంది. రాజధాని కీవ్‌ సమీపంలోని హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. ఉక్రెయిన్‌ భాషలో 'మ్రియా' అనగా 'కల'. దీన్ని ఉక్రెయిన్‌ ఎరోనాటిక్స్‌ కంపెనీ ఆంటోనోవ్‌ తయారు చేసింది. "ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 'మ్రియా'ను రష్యా ఆక్రమణదారులు కీవ్‌ సమీపంలో ధ్వంసం చేశారు. దీన్ని మీము మళ్లీ పునర్నిర్మిస్తాం. బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్‌ కలను నెరవేరుస్తాం" అని ఉక్రెయిన్‌ అధికార ట్విటర్‌ హ్యాండిల్‌ పోస్టు చేసింది.

"వారు అతిపెద్ద విమానాన్ని తగులబెట్టారు కానీ మా మ్రియా ఎప్పటికీ నశించదు" అని రాసి ఉన్న విమాన చిత్రాన్ని ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

07:43 February 28

ఆపరేషన్​ గంగలో భాగంగా ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన 249 మంది భారతీయులతో ఐదో విమానం దిల్లీకి చేరుకుంది. రొమెనియా బుచారెస్ట్​ నుంచి ఇది భారత్​కు​ వచ్చింది. భారత ఎంబసీ తమకు ఎంతగానో సాయం చేసిందని స్వదేశం చేరుకున్న అనంతరం భారతీయులు తెలిపారు. అయితే ఉక్రెయిన్ సరిహద్దు దాటడమే ప్రధాన సమస్య అని చెబుతున్నారు. ప్రభుత్వం మిగతా వారందరినీ కూడా స్వదేశం తీసుకువస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.

06:57 February 28

ఉక్రెయిన్​ను అన్నివిధాల ఆదుకుంటాం..

ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న దాడిని జీ7 దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్​కు అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొన్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి కులేబాతో జీ7 దేశాలు విదేశాంగ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా పాల్గొన్నారు.

ఉక్రెయిన్​కు భద్రతతో పాటు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని నిర్ణయించారు.

06:28 February 28

Russia attack Ukraine: ఉక్రెయిన్​కు ఆయుధ సాయం చేసేందుకు శ్వేతసౌధం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తొలుత ఉక్రెయిన్​కు స్ట్రింగర్​ క్షిపణులను డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

06:27 February 28

249 మందితో స్వదేశానికి ఐదో విమానం..

ఉక్రెయిన్​లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్​ గంగాలో భాగంగా మరో విమానం రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 249 మందితో ఐదో విమానం దిల్లీకి బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు.

06:27 February 28

ఉక్రెయిన్​ పై సైనిక చర్యకు ఫలితంగా ఇంగ్లాండ్​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో జరగబోయే అన్నీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

06:19 February 28

LIVE Russia Ukraine War: ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు

Russia Ukraine War: యుద్ధ క్షేత్రంలో ఇదో కీలక మలుపు. ఓ వైపు చర్చల మంత్రం, మరోవైపు 'అణు' హెచ్చరికలు వినిపిస్తున్న అనూహ్య దృశ్యం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఆదివారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు శాంతి చర్చలు జరిపేందుకు ఉభయ పక్షాలూ ముందుకు వచ్చాయి.

అదే సమయంలో అణ్వాయుధ వినియోగానికి సంసిద్ధంగా ఉండండంటూ తమ సేనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేయడం ఓ సంచలనం. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తూ ఉండడం, తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుండడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుతిన్‌ ఈ తెగింపు చర్యకు పూనుకున్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థకు రష్యాను దూరం చేసేలా 'స్విఫ్ట్‌' నుంచి ఆ దేశాన్ని బహిష్కరిస్తూ అమెరికా, ఇతర దేశాలు నిర్ణయం తీసుకోవడం, రష్యాలోకి విమానాల రాకపోకల్ని ఈయూ దేశాలు నిషేధించడం ఆయన చిర్రెత్తిపోవడానికి కారణం.

ఇదిలా ఉండగా.. రష్యా యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తోందంటూ పలు దేశాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మరింతమంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి తరలి వెళ్లారు. తాజా పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. వరసగా నాలుగో రోజూ ఉక్రెయిన్‌లో రణఘోష కొనసాగింది. ఆస్తులు, ప్రాణనష్టంపై స్పష్టత లేదు. రాజధాని కీవ్‌పై పట్టుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్న రష్యా.. ఆదివారం ఖర్కివ్‌ నగరంపై పంజా విసిరింది. ఎడతెగని బాంబుల మోత మోగిస్తోంది. లక్ష్యాల పేల్చివేత, విధ్వంసం కొనసాగుతున్నాయి.

ఊగిసలాట.. తర్వాత సరే

శాంతి చర్చలు జరిపేందుకు బెలారస్‌కు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన రష్యా.. దాని కోసం ఆ దేశంలోని గోమెల్‌ నగరానికి తమ ప్రతినిధి బృందాన్ని కూడా పంపించింది. ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం బెలారస్‌ తమకు ఆమోదయోగ్య ప్రదేశం కాదని ప్రకటించారు. చర్చల కోసం అక్కడికైతే వచ్చేది లేదన్నారు. తమపై దురాక్రమణకు కీలక స్థావరంగా ఆ ప్రాంతాన్నే రష్యా వాడుకుంటున్నప్పుడు అక్కడకు తామెలా వస్తామని ప్రశ్నించారు. ఇస్తాంబుల్‌, బాకు, బుడాపెస్ట్‌, వార్సా, బ్రటిస్లావా వంటి ఏ నగరమైనా తమకు ఆమోదయోగ్యమేనన్నారు. చివరకు ఇరుపక్షాల చొరవతో బెలారస్‌లోనే చర్చలు జరపడానికి మార్గం సుగమమైంది.

వీధివీధినా పోరు

ఖర్కివ్‌ నగరంలో ప్రవేశించిన రష్యా సేనలు.. అక్కడి సహజవాయువు పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పర్యావరణంపై ఇది పెను ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నాలుగో రోజూ భీకరంగా కొనసాగింది. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే రీతిలో వ్యూహాత్మక ఓడరేవుల్ని దిగ్బంధించిన రష్యా సైనికులు క్రమంగా ముందుకు వెళ్తూ ఖర్కివ్‌లోకి రావడంతో వీధుల్లో అడుగడుగునా పోరాట దృశ్యాలు కనిపిస్తున్నాయి. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇప్పటివరకు బాంబుల వర్షం కురిపించిన రష్యా.. ఆ తర్వాత ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. 14 లక్షల మంది ప్రజలున్న ఈ నగర శివార్లలో సేనలు కదం తొక్కుతున్నాయి. ఉక్రెయిన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఆదివారం కీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నల్ల సముద్రం తీరాన ఉన్న ఖేర్సన్‌ నగరాన్ని, అజోవ్‌ సముద్ర తీరంలోని బెర్డయాన్స్క్‌ ఓడరేవును దిగ్బంధించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ రెండింటికి ఉక్రెయిన్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలి: పుతిన్‌

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి రష్యా సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణమైనా రంగంలో దిగే సన్నద్ధతతో అప్రమత్తంగా ఉండాలని రష్యా అణ్వాయుధ బలగాలకు పుతిన్‌ ఆదివారం ఆదేశాలిచ్చారు. కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో పాటు దూకుడుగా ప్రకటనలు చేశాయని ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. పోరాట విధుల్లోకి వెళ్లేందుకు వీలుగా తయారుగా ఉండాలని రక్షణ మంత్రిని, సైనిక బలగాల అధిపతుల్ని ఆదేశించారు. రష్యా ప్రత్యేక బలగాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక సందేశం విడుదల చేస్తూ.. సైన్యం విజయం సాధించాలని ఆకాంక్షించారు. సైనికుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఉక్రెయిన్‌ను ఓడించడానికి నిషిద్ధ రసాయన ఆయుధాలను, జీవాయుధాలను పుతిన్‌ వాడే ప్రమాదం ఉందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ హెచ్చరించారు.

ఐసీజేకు ఉక్రెయిన్‌ ఫిర్యాదు

రష్యా సైనిక చర్యపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఉక్రెయిన్‌ ఫిర్యాదు చేసింది. దురాక్రమణను సమర్థించుకోవడానికి జరుగుతున్న మారణహోమంపై తప్పుడు మాటలు చెబుతున్నందుకు రష్యాను జవాబుదారీని చేయాలని జెలెన్‌స్కీ కోరారు. సైనిక చర్యను ఉపసంహరించుకునేలా రష్యాకు ఆదేశాలు ఇవ్వడంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పౌర ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై జరిగిన దాడులకు ఆధారాలను సేకరించి ఐసీజేకు సమర్పించనున్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

ఇది రష్యా ప్రభుత్వ ఉగ్రవాదం: జెలెన్‌స్కీ

"మేం దేశం కోసం, మా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నాం. ఆ హక్కు మాకుంది. గత రాత్రి నివాస ప్రాంతాలపై, పౌర సదుపాయాలపై విస్తృతంగా బాంబుల వర్షం కురిసింది. ఆక్రమణదారుల లక్ష్యం కాని ప్రాంతమంటూ దేశంలో ఏ ఒక్కటీ లేదు" అని జెలెన్‌స్కీ చెప్పారు.

రష్యా చేస్తున్న దురాక్రమణ యత్నాలను 'ప్రభుత్వ ఉగ్రవాదం'గా ఆయన అభివర్ణించారు. "అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ తగిన దర్యాప్తు జరిపి ఐరాస భద్రత మండలి శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యాను ఆ స్థానం నుంచి తప్పించి తగిన చర్య తీసుకోవాలి. ప్రపంచం దీనిపై దృష్టిపెట్టాలి" అని డిమాండ్‌ చేశారు.

Last Updated : Mar 1, 2022, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details