Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యన్ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. తాజాగా మరోమారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఉక్రెయిన్‌కు రక్షణ, ఆర్థిక సాయం వంటి కీలక అంశాలపై చర్చించారు. యుద్ధం మొదలైన తర్వాత బైడెన్‌తో.. జెలెన్స్కీ ఫోన్లో మాట్లాడటం ఇది రెండోసారి.
'అమెరికా అధ్యక్షుడితో మరోమారు మాట్లాడాను. ఉక్రెయిన్‌కు రక్షణ, ఆర్థిక సాయం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి కీలక అంశాలు చర్చల అజెండాలో ఉన్నాయి.'
-వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
మరోవైపు.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అర్ధగంట పాటు చర్చలు జరిగినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.
బ్లింకెన్‌తో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ
రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో పొలండ్ సరిహద్దులో భేటీ అయ్యారు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా. రష్యాపై ఆంక్షలు, కీవ్ రక్షణ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. 'ఉక్రెయిన్- పొలిస్ సరిహద్దులో యూఎస్ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ను కలిశాను. ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలను అందించటం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించి, ఒత్తిడి పెంచే మార్గాలపై చర్చించాం.' అని ట్వీట్ చేశారు కులేబా. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, రష్యాపై విధించిన ఆంక్షలను కఠినతరం చేయటంపై ఇరుదేశాలు సమ్మతించాయన్నారు.
ఉక్రెయిన్ ప్రజలకు అమెరికాతో పాటు యావత్ ప్రపంచం అండగా ఉంటుందని భరోసా కల్పించారు బ్లింకెన్. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రష్యా చేతిలో బందీగా 4 లక్షల మంది ఉక్రెనియన్లు
మేరియుపొల్‌లోని పౌరులను తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా మాట తప్పిందని ఆరోపించారు ఆ నగర మేయర్ వదిమ్ బాయ్చెంకో. నగరాన్ని రష్యా నిర్బంధించి.. మానవతా కారిడార్‌కు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బందీగా ఉన్నారని తెలిపారు.