Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో బుధవారం భారీ ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. తీరప్రాంత నగరమైన మేరియుపొల్‌లోని ఒక థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో అక్కడ వెయ్యి నుంచి 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నారని సమాచారం. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్నది వెంటనే తెలియనప్పటికీ అధిక సంఖ్యలోనే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. థియేటర్ భారీగా ధ్వంసమైనట్లు అందుబాటులోకి వచ్చిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని మేరియుపొల్ నగర పాలక సభ్యులు ఆరోపించారు. బాంబు దాడిలో ధ్వంసమైన థియేటర్ చిత్రాలను వారు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రష్యా క్రూరత్వాన్ని మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు. నిరాయుధులైన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా ఎవరినీ శత్రువు వదలిపెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత మేరియుపొల్ నగరంలో 3 లక్షల మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. నీరు, విద్యుత్, గ్యాస్ కొరత వారిని వేధిస్తోంది. ఆహారం, ఔషధాల నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ నగరాన్ని రష్యా సేనలు చుట్టుముట్టడం వల్ల మానవతా సాయం కూడా అందజేయడం కష్టమవుతోంది.
నిర్బంధంలో వైద్యులు, రోగులు
కీవ్, మేరియుపొల్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌లో మరో ఇద్దరు పాత్రికేయులు బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వార్తల సేకరణ నిమిత్తం వెళ్లిన ఫాక్స్‌న్యూస్ పాత్రికేయుల వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆ నగరంలో 12 అంతస్తుల అపార్ట్‌మెంటుపై దాడి జరగడం వల్ల ఆ భవంతి అగ్నికీలల్లో చిక్కుకుంది. రష్యా దళాలు మేరియుపొల్‌లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 400 మంది పౌరులను ఇళ్ల నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాయి. 100 మంది వైద్యులు, రోగులను కూడా నిర్బంధంలో ఉంచాయి. నిర్బంధించిన వారిని మానవ కవచాలుగా రష్యా దళాలు ఉపయోగించుకుంటున్నాయని, ఎవరినీ బయటకు రానివ్వడం లేదని సమాచారం.
రష్యా దళాలపై ఉక్రెయిన్ దాడులు..
యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే రష్యా సేనలు స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో వాహనాలు, హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సైనిక నిఘా పరికాకరాలను తొలగించేందుకు రష్యన్లు ప్రయతిస్తున్నారని ఉక్రెయిన్ సైన్యాధికారి వెల్లడించారు.
రంగంలోకి నౌకాదళం