Russia Ukraine crisis: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. ఖార్కివ్ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా ఉక్రెయిన్ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
అయితే భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్.. విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు. తనకు తెలిసి భారతీయులు ఖార్కివ్ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్లు.. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.