తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా- ఉక్రెయిన్​ కీలక చర్చలు- సంధి కుదిరేనా? - రష్యా ఉక్రెయిన్​

Russia Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్​ మధ్య ఎట్టకేలకు కీలక చర్చలు జరగనున్నాయి. రష్యా ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు ఉక్రెయిన్​ బృందం బెలారస్​ సరిహద్దుకు చేరుకుంది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

Russia Ukraine Conflict
Russia Ukraine Conflict

By

Published : Feb 28, 2022, 3:29 PM IST

Russia Ukraine Conflict: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఆగిపోయే దిశగా మొదటి అడుగు పడింది. బెలారస్‌ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూభాగంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. రెండు దేశాల ప్రతినిధులు చర్చల ప్రాంతానికి చేరుకున్నారు. చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్‌ తమ డిమాండ్లను స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌ కూడా రష్యా తక్షణమే ఆయుధాలను వదిలి కాల్పుల విరమణను అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఈ చర్చల సందర్భంగా రెండు దేశాలు ఇవే అంశాలను ప్రస్తావించనున్నాయి. అయిదు రోజులుగా ఉక్రెయిన్‌ బాంబులు, తుపాకుల మోతతో దద్ధరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా చర్చల పురోగతిపై యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

'పుతిన్​పై ఒత్తిడి పెంచండి'

మరోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్​ భాగస్వామ దేశాలకు విజ్ఞప్తి చేశారు ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా. "నేడు(సోమవారం) మా ప్రతినిధి బృందం మొదటి రౌండ్ శాంతి చర్చలు నిర్వహించడానికి వెళ్లింది. శాంతి చర్చల సమయంలో కూడా నిరంతరం కాల్పులు, బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా 4 లక్షల మందికిపైగా ఉక్రెనియన్లు శరణార్థులుగా మారారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య 70 లక్షలకు చేరుతుంది. దేశాన్ని విడిచి వెళ్లేందుకు లక్షలాది మంది ఉక్రెనియన్లు సరిహద్దుల్లో క్యూ కడుతున్నారు. యుద్ధాన్ని ఆపేదిశగా.. పుతిన్​పై ఒత్తిడి తీసుకురావాలి" అని కోరారు.

'వెనక్కి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి'

యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి.. ప్రాణాలు కాపాడుకోవాలి' అని రష్యా సైనికులను హెచ్చరించారు. ఐరోపా సమాఖ్యలో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నాటో సాయం

మరోవైపు క్షిపణులు, ట్యాంక్ నిరోధక ఆయుధాలు, అలాగే మానవతావాద దృక్పథంతో, ఆర్థిక సాయం చేసి మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు మద్దతును పెంచుతున్నాయని నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్​ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి:'బాంబుల మోత.. విద్యార్థినులపై సైన్యం వేధింపులు.. ఇంటికెప్పుడు వెళ్తామో!'

ABOUT THE AUTHOR

...view details