Russia Ukraine conflict: ఉక్రెయిన్ మిలిటరీ ఉన్నతాధికారులపై శనివారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదుల యుద్ధ ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ క్రమంలో అధికారులు బాంబు షెల్టర్‌లోకి పరుగులు పెట్టినట్లు వారితో ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్ట్ వెల్లడించారు.
అంతకుముందు తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతు గల రెండు వేర్పాటువాద ప్రాంతాల నాయకులు తమ బలగాలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. రెబల్ ప్రాంతంలో జరుగుతున్న హింసను కారణంగా చూపి రష్యా దాడికి పాల్పడే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.