తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2022, 8:25 AM IST

ETV Bharat / international

రష్యా ద్విముఖ వ్యూహం.. చర్చలకు సై అంటూనే సైనిక మోహరింపులు!

Russia Ukraine Conflict: రష్యా- ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. యుద్ధం వస్తుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. రష్యా మాత్రం దౌత్య మార్గాల్ని అనుసరిస్తూనే.. ఉక్రెయిన్​ సరిహద్దులో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. అటు చర్చలకు సై అంటూనే.. సైనిక మోహరింపులకు దిగి దాడి జరిపే అవకాశముందని తెలుస్తోంది. అసలేం జరుగుతుంది? ఏం జరగనుంది? యుద్ధమా? దౌత్య మార్గంలో పరిష్కారమా..?

Russia ukraine conflict
Russia ukraine conflict

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రష్యా ఓ వైపు దౌత్య మార్గాల్ని అనుసరిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్దులో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. పశ్చిమ దేశాలతో మరిన్ని చర్చలకు సిద్ధమన్న సంకేతాలూ ఇస్తోంది. శాంతి కోసం జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ తుది ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ఆయన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకున్నారు. కాగా ఎలాంటి హెచ్చరిక లేకుండానే రష్యా దాడి చేయొచ్చని బ్రిటన్‌ రక్షణ మంత్రి జేమ్స్‌ హీపీ చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక మోహరింపులు భారీగా పెరిగాయని, ఈ వారమే దాడి జరగొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నాటో’ భాగస్వామ్య పక్షాలు తూర్పు ఐరోపాకు అదనపు బలగాలను పంపుతున్నాయి. అనేక దేశాలు తమ పౌరులు, దౌత్యవేత్తలను ఉక్రెయిన్‌ నుంచి వెనక్కి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే పది రోజులు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధమా?.. శాంతా?.. ప్రతిష్టంభన మరికొంత కాలం కొనసాగడమా? అన్నది ఈ సమయంలో తేలుతుందన్నారు.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక మోహరింపులు 1.30 లక్షలకు చేరినట్లు అమెరికా పేర్కొంది. మెరుపుదాడికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లవ్రోవ్‌లు సోమవారం ఒక కీలక సమావేశం నిర్వహించారు. తమ భద్రత డిమాండ్లపై పశ్చిమ దేశాలతో చర్చలను కొనసాగించాలని లవ్రోవ్‌.. పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోబోమన్న హామీని రష్యా అడుగుతోంది. అలాగే తూర్పు ఐరోపా నుంచి ఆ కూటమి బలగాలు వెనక్కి మళ్లాలని డిమాండ్‌ చేస్తోంది. వీటికి పశ్చిమ దేశాలు ఒప్పుకోవడంలేదు. ఈ ప్రధాన డిమాండ్లను తోసిపుచ్చినప్పటికీ అమెరికా, దాని మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించాలని లవ్రోవ్‌.. పుతిన్‌కు సూచించారు. ఐరోపాలో క్షిపణి విభాగాల మోహరింపులు, సైనిక విన్యాసాలపై పరిమితులు వంటి అంశాలపై చర్చలకు సిద్ధమన్న పశ్చిమ దేశాల వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అయితే ఎడతెగని చర్చల ఊబిలోకి రష్యాను పశ్చిమదేశాలు దించే అవకాశం ఉందని పుతిన్‌ వ్యాఖ్యానించారు. కీలక డిమాండ్లపై అవగాహన కుదరడానికి ఇంకా అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ‘‘దానికి అవకాశం ఎప్పుడూ ఉంది. మన ప్రధాన డిమాండ్లను అమెరికా అడ్డుకోకుండా మా మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తుంది’’ అని లవ్రోవ్‌ బదులిచ్చారు. మొత్తంమీద దౌత్యమార్గంలో కొనసాగాలన్న రష్యా ఆకాంక్షను ఇది ప్రతిబింబించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒక రాజీ సూత్రానికి అంగీకరించి, అన్ని పక్షాలూ గౌరవప్రదంగా ఈ వివాదం నుంచి బయటపడేలా ఆ దేశం వ్యవహరించే అవకాశం ఉందని తెలిపారు.

జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ ఉక్రెయిన్‌ పర్యటన నేపథ్యంలో పుతిన్‌, లావ్రోవ్‌ల మధ్య ఈ సమావేశం జరిగింది. మాస్కో కూడా వెళ్లి, పోరుబాటను వీడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు నచ్చజెప్పాలని ఒలాఫ్‌ భావిస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాలను రష్యా నుంచి ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐరోపా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. వెనక్కి తగ్గడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందన్నారు.

  • యుద్ధ సంకేతాల నేపథ్యంలో లిథువేనియాలో నాటో దళాలను బలోపేతం చేయడానికి అదనపు బలగాలను పంపుతున్నట్లు జర్మనీ సైన్యం తెలిపింది.
  • కీవ్‌ పౌరులకు మేయర్‌ నుంచి లేఖలు అందాయి. నగరాన్ని కాపాడుకోవాలని అందులో సూచించారు. బాంబుల నుంచి రక్షణ పొందడానికి 4,500 ప్రదేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. పౌరులు కూడా అత్యవసర సరకులు, ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నారు.
  • తాజా పరిస్థితుల నేపథ్యంలో విమాన విధ్వంసక స్టింగర్‌ క్షిపణులు, మందుగుండు సామగ్రితో కూడిన సైనిక రవాణా విమానం నాటో సభ్య దేశమైన లిథువేనియా నుంచి ఉక్రెయిన్‌ వచ్చింది.
  • ప్రస్తుతం బెలారస్‌తో రష్యా యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తోంది. ఇవి ఆదివారం వరకూ కొనసాగుతాయి. ఈ విన్యాసాల ముసుగులో ఉత్తర దిక్కు నుంచి రష్యా దాడికి యత్నించొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పుతిన్‌ సర్కారు కొట్టిపారేస్తోంది.
  • తమ దేశ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపుల గురించి చర్చించడానికి ఐరోపాలో భద్రత, సహకారంపై ఏర్పాటైన సంస్థ (ఓఎస్‌సీఈ) సమావేశానికి ఉక్రెయిన్‌ పిలుపునిచ్చింది. ఈ భేటీ మంగళవారం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details