Russia Ukraine war: ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా రష్యా విమానయాన సంస్థలు.. తమ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా నిషేధం విధించింది బెల్జియం. ఎయిర్‌స్పేస్‌ను మూసివేసినట్లు వెల్లడించింది.
రష్యాపై గూగుల్ ఆంక్షలు..
ఉక్రెయిన్‌పై రష్యా అమానుష దాడికి నిరసనగా.. రష్యన్ స్టేట్ మీడియా తమ ఫ్లాట్‌ఫాంలలో ఆదాయాన్ని ఆర్జించకుండా గూగుల్ నిషేధం విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు గూగుల్ ప్రతినిధి. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తున్నామన్న గూగుల్ తదుపరి చర్యలకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. రష్యా మీడియా ఛానెళ్లు తమ వీడియోల ద్వారా డబ్బు ఆర్జించకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే గూగుల్ సైతం నిషేధాజ్ఞలు జారీ చేయటం ఆసక్తి రేపుతోంది. అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న అమానుష దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు. రష్యా పెట్టుబడులతో నడుస్తున్న ఛానెళ్లను తమ సిబ్బంది నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
పుతిన్‌కు జూడో సమాఖ్య షాక్..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఐజేఎఫ్ గౌరవ అధ్యక్ష హోదా నుంచి సస్పెండ్ చేసింది. ఐజేఎఫ్ అంబాసిడర్‌గా కూడా పుతిన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ జూడో సమాఖ్య ప్రకటించింది. పుతిన్‌కు జూడోలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇందులో ఆయన బ్లాక్‌బెల్ట్ కూడా సాధించారు. జూడో హిస్టరీ, థియరీ, ప్రాక్టీస్ అనే పుస్తకానికి పుతిన్ సహ రచయిత కూడా. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జూడో సమాఖ్యకు ఆయన గౌరవ అధ్యక్ష హోదాలో ఉన్నారు. అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ రెండు హోదాల నుంచి పుతిన్‌ను సస్పెండ్ చేస్తూ అంతర్జాతీయ జూడో సమాఖ్య నిర్ణయం తీసుకుంది. మే 20 నుంచి 22 వరకు రష్యాలో నిర్వహించాల్సిన ఈవెంట్‌ను కూడా ఐజేఎఫ్ రద్దు చేసింది.