ఉత్తర అమెరికా సైనిక కూటమి(నాటో)తో ఏర్పాటు చేసిన శాశ్వత మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు రష్యా (Russia NATO conflict) సంచలన ప్రకటన చేసింది. గతవారం ఎనిమిది మంది రష్యా అధికారులను నాటో బహిష్కరించడానికి ప్రతిగా ఈ నిర్ణయం (Russia NATO relations) తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక మాస్కోలోని నాటో కార్యాలయాలను మూసేస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తెలిపారు. నవంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపారు.
రష్యా పట్ల నాటో (Russia NATO relations) దూకుడుగా వ్యవహరిస్తోందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. రష్యాను ముప్పుగా చూపేందుకు నాటో ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సైనిక, రాజకీయపరమైన ఉద్రిక్తతలను తగ్గించేలా సంయుక్తంగా పని చేసేందుకు ఈ కూటమి సిద్ధంగా లేదని అన్నారు. సమాన స్థాయిలో చర్చలు జరిగేందుకు సహకరించడం లేదని చెప్పారు. బెల్జియంలోని రష్యా ఎంబసీ ద్వారా వెస్టర్న్ అలయన్స్‌తో చర్చలు సాగిస్తామని వివరించారు. అవసరమైతే తమను ఈ కార్యాలయం ద్వారా సంప్రదించాలని నాటోకు సూచించారు.