శత్రువుల నిఘా వ్యవస్థలు గుర్తించి స్పందించేలోపే లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో రూపొందిస్తున్న అత్యాధునిక హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని సోమవారం రష్యా విజయవంతంగా పరీక్షించింది. తెల్లసముద్రంలో అడ్మిరల్ గోర్షకోవ్ యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ధ్వని వేగానికి 7 రెట్ల అధిక వేగంతో ప్రయాణించి 350 కి.మీ. దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేసిందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.
జిర్కాన్ క్షిపణి 1000 కి.మీ.దూరం ప్రయాణించగలదని, ధ్వని వేగం కన్నా 9 రెట్లు ఎక్కువ వేగంతోనూ దూసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై మోహరించే లక్ష్యంతో రష్యా వీటిని అభివృద్ధి చేస్తోంది.
రష్యా క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఐరోపా-అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతాపరమైన సవాళ్లను, అపోహలను అధికం చేస్తోందంటూ నాటో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తిప్పికొట్టేలా సన్నద్ధమవుతామని తెలిపింది.