తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో కరోనా టాప్​ గేర్​- పాక్​లో 20 వేల కేసులు

రష్యాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ దేశంలో కొత్తగా 10వేల మందికిపైగా వైరస్​ పాజిటివ్​గా తేలింది. పాకిస్థాన్​లోనూ మొత్తం కేసుల సంఖ్య 20వేలు దాటింది. జపాన్​లో ఈనెలాఖరు వరకు ఆరోగ్య అత్యయిక స్థితిని పొడిగించింది ప్రభుత్వం. మరోవైపు వియత్నాం, దక్షిణ కొరియాల్లో కేసులు తగ్గుతున్నందున.. విద్యాలయాలను పునఃప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

By

Published : May 4, 2020, 5:09 PM IST

Updated : May 4, 2020, 5:15 PM IST

Russia reports 10000 corona cases, Pakistan crosses 20K
రష్యాలో మళ్లీ వెయ్యికిపైగా కొత్త కేసులు-పాక్​లో 20వేలు

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూనే ఉంది. ఐరోపా​ దేశాల్లో తీవ్ర ప్రభావం కనబర్చుతున్న వైరస్​.. అగ్రరాజ్యమైన అమెరికానూ చిగురుటాకులా వణికిస్తోంది. ఓవైపు కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో కొత్త కేసులు తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు రష్యాలో రోజువారీ కేసులు ఊహించని విధంగా వేలల్లో పెరుగుతున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 35.83 లక్షల కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2.48లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 11.61లక్షల మంది వైరస్​ బారినుంచి కోలుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు

రష్యాలో ఇవాళ 10,581 కేసులు

రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 10,581 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త వాటితో కలిపి.. రష్యాలో కొత్త కేసులు 1,45,268కి చేరాయి. మరణాలు 1,356 వద్ద ఉన్నాయి.

పాక్​లోనూ కరోనా విలయం

పొరుగు దేశమైన పాకిస్థాన్​లోనూ రోజువారీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 1,062 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇప్పటివరకు మరో 102 మంది వైరస్​ బారినపడ్డారు.

పాక్​లో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 20,186కు చేరింది. అక్కడ ఇప్పటివరకు 462 మంది ప్రాణాలు కోల్పోయారు.

12 లక్షలకు చేరువలో అమెరికా

అమెరికాలో సోమవారం ఒక్కరోజే 27వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవాళ ఇప్పటివరకు మరో 704 మందికి మహమ్మారి పాజిటివ్​గా నిర్ధరణ అవగా.. యూఎస్​లో మొత్తం కేసులు 12లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కంటే.. అమెరికాలోనే అత్యధికంగా 68వేలకు పైగా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణ అమెరికాలోని మెక్సికోలోనూ కరోనా పాజిటివ్​ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 5వేలకు పైగా కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 1,01,826కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 7,051 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఐరోపా​ దేశాలైన స్పెయిన్​, ఇటలీ, ఫ్రాన్స్​, బ్రిటన్​, జర్మనీలోనూ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల సంఖ్యలో ఈ దేశాలదే సింహ భాగం.

సింగపూర్​లో గతకొద్ది రోజులుగా రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

తెరుచుకంటున్న స్కూళ్లు

వియత్నాం, దక్షిణ కొరియాలో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నందున.. అక్కడి విద్యాలయాలను పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దక్షిణ కొరియాలో మే 13 నుంచి హైస్కూళ్లు, మే 20 నుంచి ప్రాథమిక పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నట్లు తెలిపారు.

జపాన్​లో అత్యయికస్థితి పొడిగింపు

జపాన్​లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య అత్యయిక స్థితిని మే చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి షింజో అబె.

Last Updated : May 4, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details