ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతుగా ఉంటామని మరోమారు స్పష్టం చేసింది చిరకాల మిత్ర దేశం రష్యా. తీవ్రవాద నిర్మూలనలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపింది.
భారత్-రష్యా మధ్య సైనిక, సాంకేతిక సహకారంపై మాస్కోలో జరిగిన 19వ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గే షోయిగు పాల్గొన్నారు. 2021-2030 కాలానికి ఇరుదేశాల మధ్య సహకారానికి సంబంధించిన విషయాలపై చర్చించారు.
'భారతదేశ భద్రత ప్రయోజనాలకు అనుగుణంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అండగా ఉంటామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. భారత సైనిక వ్యవస్థను అధునాతన సాంకేతికత ద్వారా మరింత పటిష్ఠం చేయడానికి మాస్కో కట్టుబడి ఉందని రష్యా రక్షణ మంత్రి పేర్కొన్నారు. రష్యా అందిస్తున్న సహకారానికి రాజ్నాథ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగబోయే ఇంద్ర సైనిక విన్యాసాలు ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.'--భారత రక్షణ శాఖ