రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్, ఎపివాక్ కరోనా టీకాల ఉత్పత్తిపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెక్టార్ ఇన్స్టిట్యూట్, గమలేయ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు అవసరమైతే విదేశీ సంస్థలతో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అలాగే అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు తయారు చేస్తున్న టీకాలపై ఆరోపణలు చేశారు పుతిన్. ఆ టీకాలను కోతి, చింపాంజీలోని అడెనోవైరస్ నుంచి తయారు చేసినట్లు చెప్పారు. అలా చేయడం వల్ల ఫలితాలు సరిగా రావన్నారు పుతిన్. గమలేయ ఇనిస్టిట్యూట్‌లో తమ పరిశోధకులు అడెనోవైరస్ను ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని వివరించారు. ఆ తర్వాత తాము మానవ అడెనోవైరస్ ఆధారంగా వ్యాక్సిన్ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది సమర్థంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.