Ukraine Russia Conflict: బాంబు దాడులతో ఉక్రెయిన్‌లో ధ్వంసరచన సాగిస్తున్న రష్యా.. దాని పర్యవసానాలను తానూ ఎదుర్కొంటోంది. బాంబుల మోతలు.. భవనాలు కూలడం వంటివి లేకపోయినప్పటికీ.. ఆ దేశాన్ని ఆర్థిక, సామాజిక సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. ప్రపంచదేశాల ఆంక్షలతో అక్కడి వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. విదేశాల కఠిన ఆంక్షలతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. ఈ క్రమంలో యుద్ధం వల్ల సొంత ప్రజలకూ నష్టం వాటిల్లుతోందన్న విషయం రష్యాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పలు అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో కార్యకలాపాలను నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావమే పడుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయిన తరువాత రష్యాయేతర దేశాల కంపెనీలన్నీ రష్యాలో కార్యకలాపాలను నిలిపివేశాయి. యుద్ధంతో దిగ్గజ సంస్థల వ్యాపార ప్రణాళికలన్నీ కుదేలయ్యాయి. యాపిల్, మెర్సిడెజ్ బెంజ్ వంటి కంపెనీలన్నీ రష్యా నుంచి బయటకు వచ్చేయాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యతను పాటించాలని భావిస్తున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్, శాంసంగ్‌లతో పాటు క్రెడిట్ కార్డు కంపెనీలూ ఆ జాబితాలో చేరాయి. రష్యా రూబుల్ విలువ 10 శాతానికి పైగా క్షీణించింది. ఫలితంగా 1.7 లక్షల కోట్ల రూబుళ్ల విలువైన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఇప్పటికే రష్యా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీని వల్ల జనజీవన ప్రమాణాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయ ఆంక్షల ఒత్తిడికి లొంగిపోవడానికి బదులు 'ఒక పరిశీలనాత్మక నిర్ణయం' తీసుకోవడంలో పెట్టుబడిదారులకు సహాయం చేస్తామని రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామం కార్పొరేట్లను ఎంతమేరకు నిలిపి ఉంచుతుందో చూడాలి.
మరింత అనిశ్చితిలోకి..
రష్యాకు ముఖ్యవనరు ముడి చమురే. యుద్ధానికి ముందు అంతర్జాతీయ ఆర్థిక రికవరీ కనిపించడం, ముడిచమురు ధరలు పెరగడంతో గత ఏడాదిలో రష్యా స్థూల దేశీయోత్పత్తి 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం అత్యంత వేగవంతమైన వృద్ధి ఇది. కానీ ఇప్పటి పరిణామాలు చూస్తుంటే.. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక 1990లలో ఏర్పడిన మాంద్యం కంటే ఈసారి ఎక్కువ ప్రభావమే ఉండొచ్చన్నది విశ్లేషకుల అంచనా.
రష్యాలో లాభాలు.. ఉక్రెయిన్‌కు..
పలు కార్పొరేట్ కంపెనీలు రష్యాలో వచ్చిన లాభాలను ఉక్రెయిన్‌కు ఇస్తుండడం విశేషం. స్టార్‌బక్స్ రష్యాలోని తన 130 స్టోర్ల లాభాలను ఉక్రెయిన్‌కు విరాళంగా ప్రకటించింది. లీగో, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఇస్తామంటున్నాయి. శాంసంగ్ ఆరు మిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది. రెడ్‌క్రాస్‌కు మాస్టర్ కార్డ్ 2 మిలియన్ డాలర్లు, సనోఫి 5 మిలియన్ యూరోలు విరాళమిచ్చాయి. బోయింగ్ 2 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు కొన్ని బ్యాంకులు రష్యా కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడం, చౌకగా రష్యా ఆస్తులను సొంతం చేసుకోవాలని తమ క్లయింట్లకు సైతం చెబుతుండడం విమర్శలకు దారితీస్తోంది. జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, గోల్డ్‌మాన్ శాక్స్ గ్రూప్‌లు బాండ్లను కొనుగోలు చేస్తున్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
భారత వ్యాపారాల సంగతేంటి?