తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా ముప్పేట దాడి- యుద్ధంలో 100 మందికిపైగా మృతి!

Russia attack on Ukraine: అమెరికా హెచ్చరించినట్లుగానే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ఇప్పటివరకు 40 మందికిపైగా ఉక్రెయిన్‌ సైనికులు 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. 50 మంది రష్యా ఆక్రమణదారులను చంపినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ ప్రకటన వెలువడిన వెంటనే దాడులు మొదలయ్యాయి. ఆ వెంటనే స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశంలో మార్షల్‌ లా విధించారు.

By

Published : Feb 24, 2022, 10:49 PM IST

Updated : Feb 25, 2022, 2:38 AM IST

Russia attack on Ukraine
Russia attack on Ukraine

Russia attack on Ukraine: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు కొన్ని వారాలపాటు తీవ్రంగా సాగిన దౌత్య ప్రయత్నాలు, పశ్చిమ దేశాల ఆంక్షల హెచ్చరికలు రష్యాను ఆపలేకపోయాయి. ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ ప్రకటించిన వెంటనే మూడు వైపుల నుంచి రష్యా పదాతి, వైమానిక, నౌకాదళాలు విరుచుకుపడ్డాయి. రాజధాని కీవ్‌సహా పలు పట్టణాలపై తెల్లవారకముందే దాడులు మొదలయ్యాయి. అక్కడి నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సైనిక, వైమానిక, ఓడరేవులు, కీలక, వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా రష్యన్‌ సేనలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. ఖార్కివ్, ఒడెస్సా సహా ఇతర నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్‌క్, సుమీ, ఖార్కివ్, చెర్నిల్‌హివ్‌, పశ్చిమ ఉక్రెయిన్‌లోని జైటోమిర్, ఎల్‌వివ్ నగరాలపై వైమానిక దాడులు చేసిన రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని పోర్టు సిటీ మర్యుపోల్‌పై నౌకాదళంతో దాడిచేసింది. గోస్టోమెల్‌, ఖేర్సన్‌ విమానాశ్రయాలపై రష్యా వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు నిప్పుల వాన కురిపించాయి. వాటిలో ఒకదాన్ని కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ సేనలు ప్రకటించాయి. కీవ్‌లోని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై కూడా క్రెమ్లిన్‌ దళాలు దాడిచేశాయి. కార్యాలయం పరిసరాల నుంచి పెద్దఎత్తున పొగలు లేచినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 40 మందికిపైగా సైనికులు, 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఒడెస్సాలోనే 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 14 మంది బృందంతో కూడిన ఉక్రెయిన్‌ మిలిటరీ హెలికాప్టర్‌.. కీవ్‌ సమీపంలో కుప్పకూలినట్లు అధికారవర్గాలు తెలిపాయి. 50 మంది రష్యా ఆక్రమణదారులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

'పోరాడేవారికి ఆయుధాలు ఇస్తాం'

Russia Ukraine news: రష్యాకు దీటుగా బదులిస్తున్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన ప్రకటించింది. బోరిస్పిల్‌, ఒజెర్నోవ్‌, కుల్బాకిన్‌, చుగెవ్‌, క్రమాటోర్స్​తదితర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై రాకెట్లు, బాంబులతో రష్యా దాడి చేసినట్లు పేర్కొంది. అయితే క్రెమ్లిన్‌ దాడిని సైన్యం తిప్పికొడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదు రష్యా విమానాలు, ఓ హెలికాఫ్టర్‌ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ప్రజలు, విశ్రాంత సైనికుల సేవలను వినియోగించుకోవాలని ఉక్రెయిన్ నిర్ణయించింది. దేశ కోసం పోరాడేవారికి ఆయుధాలు ఇస్తామని ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తమ యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ చేసిన ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌ రక్షణ ఆస్తులు, వైమానిక స్థావనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. జనావాసాలు తమ లక్ష్యం కాదని, సైనిక, వైమానిక స్థావరాలు, ఉక్రెయిన్‌ వాయుసేన స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ సైనికులకు సూచించారు. తూర్పు ఉక్రెయిన్‌లో మారణహోమం జరిగినందున దాడి చేయక తప్పలేదంటూ సైనికచర్యను సమర్థించుకున్నారు.

బెలారస్​ వైపు నుంచి దాడి

బెలారస్ వైపు నుంచి కూడా రష్యా యుద్ధ ట్యాంకులు, బలగాలు సరిహద్దు దాటుకొని వచ్చాయన్న ఉక్రెయిన్ బోర్డర్‌ గార్డ్స్ ఏజెన్సీ తెలిపింది. బెలారస్‌ కూడా దాడుల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది. రష్యా దళాలు శతఘ్నులను కూడా వాడుతున్నట్లు పేర్కొంది. అయితే రష్యా దాడుల్లో తాము పాల్గొంటున్నట్లు ఉక్రెయిన్‌ చేసిన ప్రకటనను బెలారస్ తోసిపుచ్చింది.

రష్యా దాడి మొదలైన వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వేగంగా స్పందించారు. దేశంలో మార్షల్‌లా విధించారు. అమెరికా, ఫ్రాన్స్​ అధ్యక్షులు జో బైడెన్‌, మెక్రాన్‌తో మాట్లాడిన ఆయన.. ఐరోపా ఐక్యత కోసం పశ్చిమదేశాలకు విజ్ఞప్తిచేశారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఉక్రెయిన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మధ్య నుంచే వెనుదిరిగింది.

ఉక్రెయిన్​పై సైబర్​ దాడులు

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడికి ముందు సైబర్‌ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. పార్లమెంట్, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ వెబ్ సైట్లపై సైబర్ దాడి జరిగినట్లు తెలిపింది. ఇటీవల ఉక్రెయిన్ వెబ్ సైట్లు హ్యాకింగ్‌కు గురికావటంతో దీన్ని రష్యా పనిగా ఉక్రెయిన్ ఆరోపించింది.

ఇదీ చూడండి:'పుతిన్‌' మొదటి నుంచి ఇంతే.. ఇప్పుడు ఉక్రెయిన్‌ విషయంలోనూ..

Last Updated : Feb 25, 2022, 2:38 AM IST

ABOUT THE AUTHOR

...view details