ప్రపంచంపై కరోనా రక్కసి విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు 2.92 కోట్ల మందికిపైగా కరోనా సోకింది. 9.29లక్షల మందికిపైగా చనిపోయారు. 2 కోట్ల 10లక్షల మందికిపైగా వైరస్ నయం కాగా.. మరో 72లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఇటలీలో 7నెలల తర్వాత..
కొవిడ్ ధాటికి విలవిల్లాడిన ఇటలీలో వైరస్ తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఏడు నెలల క్రితం వైరస్ హాట్‌స్పాట్‌గా మారిన కొడొగ్నో ప్రాంతంలో కొత్త కేసులు తగ్గినందున పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రెండు నెలల కఠిన లాక్డౌన్ అనంతరం.. సుమారు 80లక్షల మంది విద్యార్థుల్ని పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు వారి తల్లిదండ్రులు. అయితే.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 11 రెడ్‌జోన్ ప్రాంతాల్లో మాత్రం పాఠశాలల నిర్వహణపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.
బ్రిటన్ కొత్త వ్యూహం..
కరోనాను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం 'రూల్ ఆఫ్ సిక్స్'ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. ఒకేచోట ఆరుగురు కంటే ఎక్కువమంది సమావేశం కాకూడదు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి 100 పౌండ్లు జరిమానా విధిస్తారు పోలీసులు. కొవిడ్ కేసులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రధాని బోరిస్ జాన్సన్.
ఇండోనేషియాలో..
ఇండోనేషియా రాజధాని జకార్తాలో వైరస్ బాధితులతో.. అక్కడి ఆసుపత్రులన్నీ దాదాపు నిండిపోయాయి. దీంతో సోమవారం నుంచి రెండు వారాలపాటు లాక్డౌన్ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆసుపత్రుల్లో, రహదారుల్లో రద్దీ తగ్గించడం సహా.. కొవిడ్‌ను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. అత్యవసర సేవలతో కూడిన 11 రంగాలు మాత్రం 50శాతం సిబ్బందితో కొనసాగనున్నాయి.
వేర్వేరు దేశాల్లో కొవిడ్ కేసుల వివరాలు..
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 67.11 లక్షల మందికి వైరస్ సోకింది. 1.98 లక్షల మంది మరణించారు.
- బ్రెజిల్లో ఇప్పటివరకు 48.5 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 1.31 లక్షల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు.
- పాక్‌లో కొత్తగా 539 మందికి కొవిడ్ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3,02,020కి చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,383 మంది చనిపోయారు.
- సింగపూర్‌లో 48 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 57,454కు చేరింది.
ఇదీ చదవండి:జపాన్ ప్రధానిగా 'యోషిహిడే సుగా' ఎంపిక