మాజీ యుద్ధ సైనికుడు కెప్టెన్ టామ్ మూరేకు ఘనంగా నివాళులు అర్పించారు బ్రిటన్ ప్రజలు. మూరే సొంత గ్రామంలోని ఇంటి వద్ద వందల సంఖ్యలో అభిమానులు పుష్పాంజలి ఘటించారు.
యూకే పార్లమెంట్ సైతం మూరే మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు పార్లమెంట్ సభ్యులు.
మూరే జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. దీంతో సాయంత్రం ఆరుగంటలకు ప్రజలంతా ఆయనకు సంతాపంగా చప్పట్లు కొట్టారు. దేశ భద్రతా సిబ్బంది సైతం ఇందులో పాలుపంచుకున్నారు. హారోగేట్లోని యనియాకే బ్యారక్స్కు చెందిన బ్రిటీష్ సైనికులు చప్పట్లు కొట్టి సంతాపం తెలిపారు.
భారత్తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సైతం మూరేకు సంతాపం ప్రకటించారు. 'అత్యంత చీకటి సమయంలో దేశ ప్రజలు చిరునవ్వు చిందించేందుకు ఆయన కారణమయ్యారు' అని కీర్తించారు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ తరపున మూరే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.