తెలంగాణ

telangana

ETV Bharat / international

కదన రంగంలో కనకదుర్గలు - అంతర్జాతీయం వార్తలు

సైన్యంలో పురుషులతో సమానంగా స్త్రీలకు ప్రాధాన్యం దక్కేలా ఇటీవల సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక దేశాల సైన్యాల్లో మహిళల పాత్ర ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.

Recently, the Supreme Court issued a historic ruling that women should be given equal access to men in the military. Again, let us consider the role of women in the armies of many key countries around the world.
కదన రంగంలో కనగదుర్గలు

By

Published : Feb 21, 2020, 8:07 AM IST

Updated : Mar 2, 2020, 12:58 AM IST

'అతివలకు ఆకాశమే హద్దు'.. ఇది ఒకప్పటి మాట! ఇప్పుడు అది కూడా వారికి హద్దు కానే కాదు. అంతరిక్ష యాత్రలు చేపడుతూ.. యుద్ధ విమానాలను అలవోకగా నడిపిస్తూ.. ఎప్పటికప్పుడు గగనంలోనూ ఘనంగా మెరుస్తున్నారు మహిళలు. అన్ని రంగాల్లో తమదైన శైలిలో దూసుకెళ్తున్న స్త్రీలకు భారత సైన్యంలో పురుషులతో సమాన ప్రాధాన్యం దక్కేలా సుప్రీంకోర్టు ఈ నెల 17న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సైనిక దళాల్లో లింగ వివక్షను రూపుమాపేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలున్నాయంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు కీలక దేశాల సైన్యాల్లో మహిళల పాత్ర ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.

అమెరికా

అమెరికా

1990ల తొలినాళ్ల నుంచే నౌకాదళం, వైమానిక సేనల్లో మహిళలు పోరాట విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో యుద్ధాలు చేసేందుకు, పదాతి దళాలను ముందుండి నడిపించేందుకు మాత్రం 2016కు ముందు మహిళలకు అనుమతులు ఉండేవి కావు. ప్రస్తుతం అలాంటి తారతమ్యాలు లేవు.

బ్రిటన్‌

బ్రిటన్​

ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నెన్నో దేశాలను ఆక్రమించుకొని, తమ వలస రాజ్యాలుగా మార్చేసుకున్న దేశం బ్రిటన్‌. వారి సైన్యంలో మహిళలకు ఇంతకుముందు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అతివలను పోరాట విధులకు అనుమతించేవారు కాదు. అత్యున్నత స్థాయి ప్రత్యేక బలగాల్లోనూ వారికి స్థానం కల్పించేవారు కాదు. 2018లో ఈ నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. రాయల్‌ మెరైన్స్‌ సహా అన్ని సాయుధ బలగాల్లో స్త్రీలు పనిచేసేందుకు అవకాశం కల్పించారు.

నార్వే

నార్వే

జలాంతర్గాముల్లో సహా సైన్యంలోని ఏ పోరాట విభాగంలోనైనా సరే మహిళలు ప్రవేశించేందుకు 1985లోనే అనుమతులు కల్పించింది. ఇలాంటి అనుమతులిచ్చిన తొలి ‘నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)’ దేశంగా గుర్తింపు సొంతం చేసుకుంది.

చైనా

చైనా

ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం చైనాది. వారి గ్రౌండ్‌ ఫోర్స్‌లో మహిళలు కనీసం ఐదు శాతం కూడా లేరు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ గ్రౌండ్‌ ఫోర్స్‌ (పీఎల్‌ఏజీఎఫ్‌)లో 14 లక్షలమందికిపైగా ఉండగా.. అందులో మహిళా అధికారుల సంఖ్య దాదాపు 53 వేలు మాత్రమే.

పాకిస్థాన్‌

పాకిస్థాన్​

ఈ దేశ సైన్యంలో మహిళల సంఖ్య అంతంత మాత్రమే. అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల కేంద్రం (ఐఐఎస్‌ఎస్‌) అంచనాల ప్రకారం.. ప్రస్తుతం పాక్‌ సాయుధ బలగాల్లో 3,400 మంది మాత్రమే స్త్రీలు.

భారత్‌లో పరిస్థితేంటి?

భారత్​

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులుగా 1990ల నుంచి మహిళలు సాయుధ బలగాల్లో చేరుతున్నారు. వారి గరిష్ఠ సర్వీసు కాలం 14 ఏళ్లుగా ఉండేది. పోరాట విధులకు సహకారమందించే సిగ్నళ్లు, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి 8 విభాగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటుచేయాలని తాజాగా కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సైన్యంలో మహిళలకు కమాండ్‌ హోదా ఇచ్చేందుకు మార్గం సుగమం చేసింది.

యుద్ధ రంగంలో బలగాలను ముందుండి నడిపించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళా కమాండర్లను అనుమతిస్తున్న దేశాల సంఖ్య 16.

Last Updated : Mar 2, 2020, 12:58 AM IST

ABOUT THE AUTHOR

...view details