Russia attack Ukraine: ఉక్రెయిన్‌పై రెండోరోజు రష్యా సైన్యం భీకర దాడులు చేపట్టింది. ఈ సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. ప్రస్తుతం తలెత్తిన సంక్షోభానికి మాస్కో, కీవ్‌లు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి చర్చలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జిన్‌పింగ్‌తో పుతిన్ చెప్పారని చైనా అధికారిక మీడియో వెల్లడించింది.
అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సైతం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలకు రావాలని పునరుద్ఘాటించారు. "ఉక్రెయిన్‌వ్యాప్తంగా ఘర్షణ జరుగుతోంది. చర్చలకు ముందుకు రావాలి" అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటంతో జిన్‌పింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయంపై శుక్రవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్లకు సూచించారు. తూర్పు ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని, అది అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలు కలిగిస్తున్నట్లు పుతిన్‌కు జిన్‌పింగ్ చెప్పినట్లు చైనా మీడియా తెలిపింది. పరిస్థితులను అనుసరించే ఉక్రెయిన్‌పై చైనా వైఖరి ఆధారపడి ఉంటుందని చెప్పారని పేర్కొంది.