సెంట్రల్ లండన్‌లో ఆదివారం జరిగే సంస్మరణ కార్యక్రమానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 వెన్ను నొప్పి కారణంగా హాజరుకావడం లేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఆమె ఎంతగానో చింతిస్తున్నట్లు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు.
వైద్యుల సూచన మేరకు కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాల్లో 95 ఏళ్ల ఎలిజబెత్ పాల్గొనడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆమె పాల్గొనె తొలి కార్యక్రమం ఇదే అవుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. అయితే మునుపటిలా సంస్మరణ కార్యక్రమంలో ఎలిబబెత్ తరఫున ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పుష్పగుచ్ఛం సమర్పిస్తారని అధికారులు చెప్పారు.
ఎలిజబెత్‌కు ఏటా ఆదివారం జరిగే సంస్మరణ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది. రెండో ప్రచంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ యుద్ధ సమయంలో ఎలిజబెత్ ఆర్మీ డ్రైవర్‌గా సేవలందించారు. అయితే ఆమె హాజరుకాకపోయినా.. రాజవంశ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.