బ్రిటన్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో తన అన్ని అపాయింట్మెంట్లు రద్దు చేసుకున్నారు ఎలిజబెత్ రాణి. ముందు జాగ్రత్త చర్యగా రాజప్రాసాదాన్ని విడిచి రాజకుటుంబ విడిది భవంతి.. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని విండ్సర్ క్యాసిల్‌లో కొంతకాలం పాటు నివాసం ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈస్టర్ కాలంలో విండ్సర్ క్యాసిల్‌లో రాజకుటుంబం విడిది చెయ్యడం సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ఈ విడిది కాలాన్ని కొన్ని మాసాల పాటు పెంచారు.
వచ్చే నెలలో 94వ ఏట అడుగుపెట్టనున్న ఎలిజబెత్ రాణి పలు గార్డెన్ పార్టీలు, ఈస్టర్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అయితే బ్రిటన్‌లో ఇప్పటికే 71మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాణి షెడ్యూల్ మార్చుకున్నారు.
ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో ప్రస్తుతానికి ఎలిజబెత్ రాణి యథావిధిగా సంభాషిస్తారని చెప్పారు అధికారులు. అయితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.