కొవిడ్-19 కట్టడికి తమ దేశం ఇప్పటికే విడుదల చేసిన రెండు వ్యాక్సిన్లు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, మూడో టీకా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కరోనా వైరస్ వ్యాక్సిన్ అంశంపై రాజకీయం చేయొద్దని హెచ్చరించారు.
వర్చువల్‌గా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశంలో ప్రసంగించారు పుతిన్. ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులు అసరమైన దేశాలకు అందించే ఆలోచనకు రష్యా మద్దతు ఇస్తుందని తెలిపారు.
" రష్యాలో రెండు వ్యాక్సిన్లు విడుదల అయ్యాయి. ఆ టీకాలు సమర్థవంతమని, సురక్షితమని పనిచేస్తున్నాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ధ్రువీకరించాయి. మూడో వ్యాక్సిన్ విడుదలకు సిద్ధమవుతోంది. మేము ఇతర దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే వ్యాక్సిన్‌పై రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రతిపాదిస్తున్నాం. యావత్ ప్రపంచానికి ఇప్పుడు టీకా అవసరం. ఏ దేశంతోనైనా కలిసి పనిచేయటానికి మేము సిద్ధం. "