తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా టీకా బేషుగ్గా పనిచేస్తోంది: పుతిన్ - Putin touts Russia's COVID-19 vaccine

రష్యా తయారు చేసిన కొవిడ్ టీకాపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అంతర్జాతీయ నిబంధనలు, రష్యా చట్టాలకు అనుగుణంగానే వ్యాక్సిన్​కు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Putin touts Russia's COVID-19 vaccine as effective and safe
రష్యా టీకా బేషుగ్గా పనిచేస్తోంది- పుతిన్

By

Published : Aug 27, 2020, 10:48 PM IST

రష్యా తయారు చేసిన టీకా అత్యంత సమర్థంగా, సురక్షితంగా పనిచేస్తోందంటూ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కితాబిచ్చుకున్నారు. రష్యా 24 టీవీ ఛానెల్​ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ అయిన 'స్పుత్నిక్-వి'కు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉన్న రష్యా చట్టాలకు లోబడే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

"ఈ టీకా శాశ్వత రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుందని మన నిపుణులకు పూర్తి స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాడేందుకు సురక్షితం."

-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

తన కూతుళ్లకు కూడా ఈ టీకాను ఇచ్చినట్లు పుతిన్ గతంలోనే ప్రకటించారు. వారి శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు చెప్పారు. వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే వీటికి కావాల్సిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం చూపించలేదు.

నిబంధనలు ఉల్లంఘించి!

రష్యా ఇంత వేగంగా టీకాను ఆమోదించడాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. వ్యాక్సిన్ సురక్షితమని చెబుతున్న వాదనలకు బలం చేకూర్చే సమాచారాన్ని అందించడంలో రష్యా విఫలమైందని విమర్శిస్తున్నారు. శాస్త్రీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రయోగాలే లేకుండా!

నిజానికి టీకాను వేలాది మందిపై ప్రయోగించిన తర్వాతే దాని సమర్థతను తేల్చాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. రష్యా టీకాను అతి కొద్ది మందిపైనే పరీక్షించారని పేర్కొంటున్నారు. టీకాపై సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యాతో సంప్రదిస్తోంది. అయితే ఇప్పటివరకు వారికి ఎలాంటి సమాచారం అందలేదని డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details