చైనా, భారత్‌లలో తమ స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కార్యచరణకు రావాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తమ టీకా ప్రభావవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించారు పుతిన్.
"బ్రిక్స్ దేశాల వ్యాక్సిన్ అవసరాల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం. ఆగష్టులో రిజస్టర్ అయిన మా స్పుత్నిక్ వీ టీకాను చైనా, భారత్‌లో ఉత్పత్తి చేయనున్నాం. క్లినికల్ ట్రయల్స్ కోసం బ్రెజిల్, భారత్‌తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా, భారత్‌లలో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఫార్మా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కేవలం తమ దేశ అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాల కోసం వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడుతున్నాం.
-- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు