రష్యా అధ్యక్షుడిగా తన అధికారాన్ని మరోసారి కొనసాగించుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ చట్టసభసభ్యురాలైన వాలెంటీనా తెరిస్కోవా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా నిలిచి.. డ్యూమా(దిగువసభ)లో ఆమోదం పొందేలా చేసుకున్నారు.
తెరిస్కోవా ప్రతిపాదన... ఆమోదం
1963లో సోవియట్ రష్యా వ్యోమగామిగా... అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ వాలెంటినా తెరిస్కోవా. ప్రస్తుతం ఆమె రష్యా చట్టసభ సభ్యురాలిగా ఉన్నారు.
రష్యా అధ్యక్ష పదవిలో వరుసగా రెండు దఫాలకు మించి ఉండరాదన్న పరిమితిని రద్దు చేయాలని, లేదా ఆ నియమాన్ని పూర్తిగా (రీసెట్) ప్రక్షాళించాలంటూ తెరిస్కోవా ప్రతిపాదించారు. క్రెమ్లిన్ నియంత్రిత దిగువ సభ స్టేట్ డ్యూమా... తెరిస్కోవా ప్రతిపాదించిన సవరణలను 382-0 ఓట్ల తేడాతో ఆమోదించింది. అలాగే పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ మార్పులకూ ఆమోదం తెలిపింది. అయితే ఈ సభకు 44 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందినందున.. పుతిన్ ఇప్పటివరకు 4 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన లెక్క పరిగణనలోకి రాదు. ఈ సవరణలపై ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహిస్తారు.
పుతిన్ ప్రస్తుత ఆరేళ్ల పదవీ కాలం 2024తో ముగియనుంది. తాజాగా రాజ్యాంగ సవరణ కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో... తరువాతి ఎన్నికల్లో కూడా పోటీ చేసి అధికారం చేజిక్కించుకునేందుకు ఆయనకు అవకాశం లభించింది.