తెలంగాణ

telangana

ETV Bharat / international

వార్​ 2.0.. గేర్​ మార్చిన పుతిన్.. ఇక విదేశీ ఫైటర్లతో ఉక్రెయిన్​పై దాడులు!

Ukraine Russia War: ఉక్రెయిన్​పై దాడులను మరింత తీవ్రం చేసే దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్​ అడుగులు వేస్తున్నారు. తాజాగా విదేశాలకు చెందిన 16వేల మంది ఫైటర్లను ఉక్రెయిన్​ బరిలో దించేలా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అణుకేంద్రాలు, వైమానిక స్థావరాలపై రష్యా దాడులను ముమ్మరం చేసింది.

vladimir putin
పుతిన్

By

Published : Mar 11, 2022, 4:18 PM IST

Updated : Mar 11, 2022, 7:12 PM IST

Ukraine Russia War: ఉక్రెయిన్​తో చర్చలు జరుపుతూనే దాడులను కొనసాగిస్తోంది రష్యా. ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తున్న అధ్యక్షుడు పుతిన్​ పట్టువీడటం లేదు. ఉక్రెయిన్​పై పోరుకు తాత్కాలిక విరామాలు ప్రకటిస్తూనే అంతకంటే భీకర దాడులతో విరుచుకుపడేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాడి చేయని ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తూ రష్యన్​ సేనలు ​విజృంభిస్తున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్​లోని వైమానిక స్థావరాలపై శుక్రవారం జరిపిన దాడులే అందుకు ఉదాహరణ.

ఎయిర్​పోర్ట్​పై దాడులు

మరియుపోల్​లోని మెటర్నిటీ ఆస్పత్రిపై దాడులు జరిపి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న రష్యా.. పశ్చిమ ఉక్రెయిన్​లోని విమానాశ్రయాలే లక్ష్యంగా శుక్రవారం భీకర దాడులు జరిపింది. లుట్సక్​​ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఇద్దరు అధికారులు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవానో ఫ్రాంకిస్క్​ ఎయిర్​పోర్ట్​పై​ బాంబు దాడులు జరిపారు రష్యన్లు. మరోవైపు కీవ్​లో యుద్ధ ట్యాంకుల భారీ కాన్వాయ్​ను రష్యా ఉపసంహరించుకుంది.

'అవును నిజమే'

ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో ప్రత్యర్థిపై మరింత పట్టు సాధించేందుకు రష్యా.. ఇతర దేశాల నుంచి ఫైటర్లను రప్పిస్తోందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పుతిన్​ వీటిని ధ్రువీకరించారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన వీరిని ఉక్రెయిన్​కు తరలించాలని పుతిన్​ ఆదేశించినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్​పై పోరాడేందుకు సిద్ధమంటూ స్వచ్ఛందంగా 16వేల మందికిపైగా రష్యాకు దరఖాస్తులు చేసుకున్నారని ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. వీరిలో చాలా మంది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్​ స్టేట్​పై పోరాడిన వారు అని పేర్కొన్నారు.

మరో అణుకేంద్రంపై దాడి..

ఉక్రెయిన్​లోని అణు కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేపడుతోంది. ఇప్పటికే ఐరోపాలోని అతిపెద్ద అణు రియాక్టర్ అయిన జాపోరిషియాపై దాడి చేసిన రష్యా బలగాలు తాజాగా మరో అణుకేంద్రంపై దాడి చేశాయి. బాంబులతో ఖర్కివ్​లోని అణు పరిశోధన కేంద్రంపైన రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ దాడిలో యూనిట్​లో విద్యుత్​ సరఫరా అంతరాయం ఏర్పడటం సహా భవనం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు.

మెటాపై ఆగ్రహం

ఉక్రెయిన్​లో జీవాయుధాలు ఉన్నాయన్న తమ వాదనపై సమావేశం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య భద్రతా మండలిని రష్యా విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. రష్యన్​ నేతలు, సైనికాధికారులను దూషించేందుకు అనుమతిస్తూ మేటా సంస్థ నిబంధనలను సవరించడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థపై క్రిమినల్​ కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించింది.

బైడెన్ ప్రకటన..

రష్యా వరుస ఆంక్షలను విధిస్తున్న అమెరికా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రష్యాకు ఉన్న మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​ ట్రేడ్​ స్టేటస్​ రద్దు చేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్​ శుక్రవారం ప్రకటించనున్నారు. జీ7, ఐరోపా సమాఖ్య దేశాలతో కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది అమలులోకి వస్తే.. అమెరికా సహా మిత్ర దేశాలకు రష్యన్​ దిగుమతులపై మరింత ఎక్కువగా సుంకాలు విధించే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఉక్రెయిన్​కు మద్దతుగా అమెరికా ఇప్పటికే 13.6 బిలియన్​ డాలర్ల అత్యవసర ప్యాకేజీని ప్రకటించింది. వీటిలో దాదాపు సగం ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సైనిక సాయం, తూర్పు ఐరోపా దేశాలకు అమెరికా బలగాలను పంపేందుకు ఖర్చుచేయనున్నారు. మిగిలిన దాంట్లో మానవతాసాయం, ఆర్థిక సాయం సహా రక్షణ బలోపేతం, విద్యుత్, సైబర్‌ సెక్యూరిటీ అవసరాల కోసం వెచ్చించనున్నారు.

ఇదీ చూడండి :ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం

Last Updated : Mar 11, 2022, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details