రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టుకు నిరసనగా ఆయన మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు నగరాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. ఈ ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్తాలు కారుతున్నా.. ఆందోళనలు కొనసాగించారు.
2 వేల మందికిపైగా అరెస్ట్..
పలు నగరాల్లో నిర్వహిస్తున్న ఆందోళనలను అదుపు చేసేందుకు 2 వేలకుపైగా నావెల్నీ మద్దతుదారులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిరసనలను పర్యవేక్షిస్తున్న ఓ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2,131 మంది అరెస్టయ్యారు. అందులో మాస్కోలో 300, సెయింట్ పీటర్స్బర్గ్లో 162 మంది ఉన్నారు. సుమారు 70 పట్టణాలు, నగరాల్లో అరెస్టులు జరిగినట్లు సమాచారం.