తెలంగాణ

telangana

ETV Bharat / international

మోడెర్నా, ఫైజర్‌ కంటే తక్కువ ధరలోనే..!

మోడెర్నా, ఫైజర్​ వ్యాక్సిన్​లకంటే రష్యా అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌-వి టీకా తక్కువ ధర ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, కచ్చితంగా ఎంత ఉంటుందని మాత్రం వెల్లడించలేదు. మూడో దశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ 92శాతం సమర్థత కనబరిచినట్లు మధ్యంతర ఫలితాలను ఇటీవలే ప్రకటించింది.

price of sputnik v vaccine lower than pfizer and moderna
మోడెర్నా, ఫైజర్‌ కంటే తక్కువ ధరలోనే..!

By

Published : Nov 22, 2020, 11:00 PM IST

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ధర, ఇదివరకే వెల్లడించిన మోడెర్నా, ఫైజర్‌ టీకాల కంటే చాలా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా స్పుత్నిక్‌-వి తయారీదారులు వెల్లడించారు. ‘ఫైజర్‌ టీకా ధర 19.50 డాలర్లు కాగా మోడెర్నా ధర 25-37 డాలర్లు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవి రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీటి ధర 39డాలర్లు, 50-74డాలర్లు అవుతుంది. అయితే, స్పుత్నిక్‌-వి టీకా ధర మాత్రం ఈ రెండింటి కంటే చాలా తక్కువగానే ఉంటుంది’ అని స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రూపకర్తలు ప్రకటించారు. అయితే, కచ్చితంగా ఎంత ఉంటుందని మాత్రం వెల్లడించలేదు.ఇక గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌(కొవిషీల్డ్‌) ధర రూ.500-600కే అందుబాటులో ఉండనుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధర్‌ పూనావాలా ఈమధ్యే వెల్లడించారు. రెండు డోసుల ధర వెయ్యి నుంచి రూ 1200 వరకు ఉంటుందని తెలిపారు.

ఇదిలాఉంటే, రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అక్కడి ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు నెలలో రిజిస్టర్‌ చేసుకున్న స్పుత్నిక్‌ టీకా యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా మూడో దశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ 92శాతం సమర్థత కనబరిచినట్లు మధ్యంతర ఫలితాలను ఈ(నవంబర్‌) నెలలోనే ప్రకటించింది. మరో ముందడుగు వేసిన స్పుత్నిక్‌ మిగతా టీకాల కంటే తమది చాలా తక్కువ ధర ఉంటుందని మరోసారి ఆసక్తికర ప్రకటన చేసింది. ఇక మోడెర్నా తయారుచేసిన టీకా 94.5శాతం సమర్థత కలిగినట్లు ప్రకటించగా ఫైజర్‌ మాత్రం 95శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. మరో అడుగు ముందుకు వేసిన ఫైజర్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details