ఎవరైనా కొత్తగా పెళ్ళయిన వారు ఎదురైతే ఏం చేస్తాం? శుభాకాంక్షలు చెబుతాం! రాలేకపోయామనో.. పెళ్ళి బాగా జరిగిందా అనో.. యోగక్షేమాలు అడుగుతాం! కానీ.. ముచ్చటగా ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(Boris Johnson)ను తొలిసారి కలిసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఎలా పలకించారో తెలుసా? "మనమిద్దరం తాహతుకు మించి పెళ్లి చేసుకున్నాం!" అంటూ జాన్సన్‌పై జోకేశారు బైడెన్ (తనది కూడా రెండో పెళ్లి) మరి!.
జీ-7 దేశాల సదస్సులో పాల్గొనటానికి గురువారం ఇంగ్లాండ్ చేరుకున్న బైడెన్.. తన తొలి విదేశీ పర్యటనను ఉల్లాసంగా ఆరంభించారు. బైడెన్ దంపతులు బోరిస్ జాన్సన్ జంటను కలసుకున్నారు. 56 ఏళ్ల జాన్సన్ ఇటీవలే 33 ఏళ్ల సిమండ్స్‌ను పెళ్ళాడారు. అందుకే కలసిన వెంటనే బైడెన్- జాన్సన్‌ను ఆటపట్టించారు. "మనిద్దరికీ ఓ సారూప్యముంది. అదేంటంటే.. ఇద్దరమూ మన తాహతుకుమించిన వారిని పెళ్లాడటమే" అంటూ బైడెన్ నవ్వేశారు. దీంతో.. జాన్సన్ కూడా "నేను మీతో ఈ విషయంలో విభేదించటం లేదు.. ఈ విషయంలోనే కాదు.. ఏ విషయంలోనూ" అంటూ నవ్వేశారు!
కొత్త అట్లాంటిక్ చార్టర్‌పై సంతకం..
గురువారం ముఖాముఖి చర్చలకు ముందు ఈ ఇద్దరు నేతలూ.. 80 సంవత్సరాల కిందట రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్, అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌లు సంతకం చేసిన అట్లాంటిక్ చార్టర్ దస్తావేజులను తిలకించారు. ఆ చార్టర్ స్ఫూర్తితో.. కొత్త అట్లాంటిక్ చార్టర్‌పై బైడెన్, జాన్సన్‌లు సంతకాలు చేశారు.