ప్రపంచ జనాభాలో 70% మందికి టీకాలు వేయాలనే లక్ష్యం నేపథ్యంలో టీకా తయారీని రెట్టింపు చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో(UNGA 2021) ప్రసంగించిన ఆయన.. వచ్చే ఏడాదిలోగా 50 కోట్ల ఫైజర్ టీకా(Pfizer Vaccine) డోసులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.
185 దేశాల్లో డెల్టా వేరియంట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)తెలిపింది. గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త కేసులు క్షీణించాయని పేర్కొంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో 22 శాతం, ఆగ్నేయాసియా ప్రాంతంలో 16 శాతం కేసుల తగ్గుదల అనేది ఊరట కలిగించే అంశమని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే భారత్, అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫిలిప్పీన్స్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. లాంబ్డా, మ్యూ వేరియంట్‌ల వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నట్లు వివరించిన డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక.. వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ ప్రస్తుతం 185 దేశాలకు విస్తరించిందని వివరించింది.
మూడు కేసులకే లాక్డౌన్..
కరోనాను ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్న చైనా తీరుతో విదేశీ పర్యటకులతో పాటు.. సొంత ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. వరుస లాక్డౌన్లు విధిస్తోంది. 2022-ఫిబ్రవరి 4నుంచి ప్రారంభంకానున్న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో విదేశీ అథ్లెట్లు పాల్గొనాల్సి ఉంది. అయితే విదేశీ ప్రయాణికులపై ఆంక్షలున్నాయి. ఈ గేమ్స్‌లో ప్రేక్షకులకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉందని వాంగ్ హుయ్ అనే ట్రావెల్ ఏజెంట్ వాపోయాడు. దీనితో సొంత ప్రజలు నిరుత్సాహపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ గేమ్స్‌తో పాటు.. మార్చి 4-13 తేదీల్లో జరిగే పారాలింపిక్ వింటర్ గేమ్స్‌లో దాదాపు 2,900 మంది అథ్లెట్లు పోటీ పడేందుకు వస్తారని అంచనా.
అయితే చైనా వాదన మరోలా ఉంది. జులైలో దేశంలోకి వచ్చిన వ్యాపారులే దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తికి కారణమయ్యారని చైనా ఆరోపించింది. మొత్తంగా వైరస్‌పై పోరులో చైనా అవలంబిస్తున్న తీరును కొందరు నిపుణులు తప్పుబడుతున్నారు. 'ప్రస్తుత చర్యలతో వైరస్ ముప్పు తొలగిపోతుందని అనుకోవట్లేదు. వాస్తవికతతో జీవించాల్సిన అవసరం ఉంది' అని హాంకాంగ్ యూనివర్శిటీ మెడికల్ సెక్యూరిటీ ప్రొఫెసర్ నికోలస్ థామస్ అభిప్రాయపడ్డారు.