ప్రేమకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటిలో తాజ్‌మహల్ ఎనలేదని. అయితే ఇప్పటివరకు ప్రియుడు.. తన ప్రియురాలికి గుర్తుగా కట్టించిన సాక్ష్యాల గురించే తెలుసు. కానీ ఓ భార్య తన భర్త కోసం గుడి కట్టింది. అది ఎక్కడ ఉంది? అక్కడ ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఇది చదవండి...
తాజ్‌మహల్: భార్య చివరి కోరిక తీర్చేందుకు..
భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన కట్టడాలలో తాజ్‌మహల్ ఒకటి. ఆగ్రా పట్టణంలో యమునా నది తీరాన అమర ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న తాజ్‌మహల్ వెనుక గుండెను మెలిపెట్టే ప్రేమకథ దాగి ఉంది. షాజహాన్ ప్రియసఖి, భార్య ముంతాజ్ చనిపోతూ చివరి క్షణంలో భర్తను ఒక కోరిక కోరింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చూడని సమాధిని తనకోసం నిర్మించమని అడిగింది. భార్య కోరిక మేరకు షాజహాన్ తాజ్‌మహల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.
తాజ్‌మహల్‌ను 1631లో ప్రారంభించి 1653 వరకు.. అంటే 22ఏళ్ల పాటు దాదాపు 20వేల మంది కూలీలు నిర్మించారు. ప్రధాన సమాధి 1648లో పూర్తవగా ఆ తరువాత చుట్టుపక్కల భవనాలు, ఉద్యానవనం నిర్మించడానికి ఐదేళ్లు పట్టాయి. నాలుగు దిక్కుల నుంచి ఒకేలా కనిపించే ఈ కట్టడానికి ఇటలీ, పర్షియా కళాకారులు నిర్మాణ ఆకృతిని తయారు చేశారు. సృష్టిలో ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించే తాజ్‌మహల్ ఈ భూమిపై ఉన్న కట్టడాలన్నిటిలో అందమైనదని చెప్పడంలో సందేహం లేదు.
చందోర్ గార్డెన్: కొండప్రాతాన్ని అందమైన తోటగా..
అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న చందోర్ గార్డెన్ ప్రముఖ చిత్రకారుడైన 'డగ్లస్ చందోర్', అతని భార్య 'ఇనా క్యుట్‌మన్' ప్రేమకు నిదర్శనం. 1926లో అమెరికా వచ్చిన డాగ్లస్ చందోర్ అతి తక్కువ కాలంలోనే ప్రముఖ చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. క్యుట్‌మన్‌తో తనకు ఏర్పడిన పరిచయాన్ని 1930లో వివాహ బంధంతో ముడివేశాడు.
1936 నుంచి 16 ఏళ్ల పాటు వీరిద్దరూ కష్టపడి టెక్సాస్‌లోని అతి భయంకరమైన కొండప్రాంతాన్ని అత్యంత సుందరమైన తోటగా మార్చేసి, అందులోనే జీవించేవారు. 1953లో చందోర్, 1978లో క్యుట్‌మన్ మరణించాక.. వీరి ప్రేమకు గుర్తుగా మిగిలిపోయిన చందోర్ గార్డెన్ ప్రస్తుతం పెళ్లిళ్లకు వేదికగా మారింది.
మిరాబెల్ ప్యాలెస్: ప్రేయసి అభిరుచికి తగ్గట్టు..
ఆస్ట్రియాలోని మిరాబెల్ ప్యాలెస్‌ను 1606లో 'ఆర్చ్‌బిషప్ వోల్ఫ్' అనే రాకుమారుడు తన ప్రేయసి 'సాలోమ్ ఆల్ట్' కోసం కట్టించాడు. ప్రియురాలి అభిరుచికి తగ్గట్టు ఆర్చ్‌బిషప్ ప్యాలస్‌లోని ప్రతి శిల్పాన్ని, గదిని అలంకరించాడు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చుకున్న వీరికి 15 మంది సంతానం. వీరిద్దరి మరణం తరువాత ఈ ప్యాలెస్ బయటి గోడలకు అనేక మార్పులు చేశారు కానీ లోపల ఉన్న శిల్పాలను, పురాతన కళాఖండాల అందాలను మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు. పర్యటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మిరాబెల్ ప్యాలెస్.. ప్రపంచంలోని అమర ప్రేమికుల కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోయింది.