పోలెండ్ మోటర్ షో కార్యక్రమం మీకు సరికొత్త స్పోర్ట్స్కార్లు, అధునాతన వాహనాలంటే అమితమైన ప్రేముందా... అలాంటి కార్లను వెంటనే చూసేయాలనుందా... అయితే పోలెండ్‌లోని పోజ్నాన్ నగరానికి వెళ్లాల్సిందే... పోజ్నాన్ నగరంలో జరుగుతున్న మోటర్ షో కార్యక్రమం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆడీ, ఫోక్స్ వాగన్ తదితర దిగ్గజ కార్ల తయారీ సంస్థలు రూపొందించిన అధునాతన ఎలక్ట్రిక్ కార్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రైవర్ ప్రమేయం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
ఆడీ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన స్పోర్ట్స్‌కారు, జర్మనీకి చెందిన ఫోక్స్ వాగన్ సంస్థ 'బజ్ అటానామస్ సాంకేతిక పరిజ్ఞానం' సాయంతో తయారుచేసిన మైక్రోబస్ (వెనగాన్)ను ప్రదర్శనలో ఉంచింది. పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో కూడిన ఈ వెనగాన్ డ్రైవర్ ప్రమేయం లేకుండానే నడుస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది మోటార్ షో కార్యక్రమంలో 60 నూతన కార్లను మొదటిసారిగా ప్రదర్శనలో ఉంచారు.
" ఇక్కడి ప్రధానాంశం ఏంటంటే... ఈ ఎలక్ట్రిక్ కారు చాలా బాగుంది. నడిపేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా వేగంగా వెళ్లగలదు. 300 హార్స్ పవర్స్ కలిగిన రెండు ఇంజిన్లు ఈ కారులో ఉంటాయి. అందుకే కారు వేగం ఎక్కడా తగ్గదు. కారు మొదలైనప్పటి నుంచి వీలైనంత వేగంతో ప్రయాణించొచ్చు. అందుకే కారు నడుపుతుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పొగ విడుదల చేసే కార్లతే పోలిస్తే ఇవి శబ్దం లేకుండా ప్రయాణిస్తాయి. నేను ఇంత వరకు ఇలాంటి ప్రత్యేకతలున్న కారును చూడలేదు."
- తోమాస్ టోండర్, ఫోక్స్ వాగెన్ సంస్థ అధికార ప్రతినిధి
ఈనెల 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది. దాదాపు లక్షా 50 వేల మంది వీక్షకులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.